Bandi Sanjay Fire on Congress Negligence : బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై గులాబీ పార్టీ నాయకులు ప్రశ్నించటం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను(Congress Six Guarantees) వందరోజుల్లో తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ భూములు కేటాయించడం హర్షణీయమన్నారు.
ఆ నాలుగు అక్షరాలే బీజేపీ అజెండా : కిషన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్దంగా ఉందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా విచారణ ఎందుకు కోరడం లేదని సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగిన ప్రజాహిత యాత్రలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్, అధికార, ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అనంతరం జమ్మికుంట మండలంలో కొనసాగిన యాత్రలో నేరుగా ప్రజలను కలుసుకొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను(Central Government Welfare Schemes) వివరించారు.
"కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు పడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు సహకరిస్తామన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు."-బండి సంజయ్, బీజేపీ ఎంపీ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వం నివేదికలిచ్చినప్పటికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి తప్పు ఎవరు చేసిన తప్పేనని, వారు శిక్షార్హులేనన్నారు. దేశంలో ఎక్కడ చూసిన ప్రజలు మోదీ మోదీ అంటున్నారని, మరోసారీ మోదీ ప్రధాని(PM Modi) కావటం ఖాయమని బండి సంజయ్ అన్నారు.
17 ఎంపీ సీట్లు గెలుస్తాం : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో 350కి పైగా సీట్లు గెలుస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 17కు 17 స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన కలుగుతుందన్నారు. ఈ నెల 4, 5వ తేదీన ప్రధాని మోదీ సభలో పాల్గొనేందుకు వెళ్తున్నానన్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 8, 9వ తేదీల్లో ప్రజాహిత యాత్రకు విరామాన్ని ఇస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.