Bandi Sanjay Nomination For Karimnagar MP Seat : తెలంగాణలో లోక్‌సభ నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ రెండోసారి నామినేషన్ వేశారు. ఆనవాయితీ ప్రకారం తన తల్లి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన నేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న బండి సంజయ్ నామపత్రాలు దాఖలు చేశారు.
Lok Sabha Polls Nominations in Telangana 2024 : నామినేషన్ అనంతరం బండి సంజయ్ నేరుగా ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వద్దకు చేరుకొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలన్నలక్ష్యంతో పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే గుజరాత్‌లో ఏకగ్రీవంతో బోణీ అయిందని, మరో 399 కోసమే మీరు కష్టపడాలని బండి సంజయ్ కోరారు.
"పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రధానిగా నరేంద్ర మరోసారి కావాలి. అందుకోసం మీరందరూ కష్టపడాలి. కరీంనగర్ ప్రజలు ఆలోచించండి బీజేపీ కావాలా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కావాలా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు. కరోనా సమయంలో ఇక్కడి ప్రజల కోసం ఎన్నో సేవలు చేశాను. అందుకే ఆలోచించి ప్రజలు ఓటు వేయండి." - బండి సంజయ్, కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్‌ని భారీ మెజార్టీతో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఇంకా 399 సీట్లలో పార్టీని గెలిపించాలని కోరారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని, మోదీ మూడోసారి ప్రధాని కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. మోదీని ఆశీర్వదించాలని, తెలంగాణ సంక్షేమాన్ని ఆయన చూసుకుంటారని భూపేంద్ర పటేల్ చెప్పారు.
నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత ఆయనకే దక్కింది. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. 400 సీట్లలో విజయాన్ని అందించాలి. - భూపేంద్ర పటేల్, గుజరాత్ సీఎం
అనంతరం ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ నుంచి కోర్టు, గీతాభవన్ మీదుగా టవర్ సర్కిల్ దాకా రోడ్‌షో కొనసాగింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.