Kurnool Lok Sabha Constituency: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు లోక్ సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరి నియోజకవర్గం. 2009 పునర్విభజనలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యలో మార్పు లేకపోయినా డోన్ స్థానంలో నూతనంగా ఆవిర్భవించిన మంత్రాలయం వచ్చి చేరింది. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు శాసనసభ స్థానాలు కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 16 లక్షలా 93 వేలా 5 వందలా 97. వీరిలో పురుష ఓటర్లు 8 లక్షలా 39 వేలా 33మంది కాగా, మహిళలు 8 లక్షలా 54 వేలా 3 వందలా 27 మంది. ట్రాన్స్ జెంటర్ ఓట్లు 237వరకు ఉన్నాయి.
1952లో కర్నూలు లోక్ సభకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతారాంరెడ్డి గెలుపొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. ఆయన కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మూడు సార్లు గెలుపొందారు. కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999లో కేఈ కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థులుగా కోట్ల విజయభాస్కర రెడ్డిపై గెలుపొందారు. ఇప్పటి వరకు 17 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సార్లు విజయం సాధించగా తెలుగుదేశం రెండు సార్లు, వైకాపా రెండు పర్యాయాలు, స్వతంత్రులు ఒకసారి విజయం సాధించారు.
2014లో వైఎస్సార్సీపీ నుంచి బుట్టా రేణుక, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ గెలుపొందారు. ఈసారి కార్మికశాఖా మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంను పార్లమెంటు నుంచి పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఆదేశించింది. ఆయన సున్నితంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక గత్యంతరం లేక కర్నూలు మేయర్ గా ఉన్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీవై రామయ్యను బరిలోకి దింపింది వైసీపీ. కురవ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజుకు టీడీపీ సీటు ఇవ్వగా యాదవ సామాజిక వర్గానికి చెందిన రాంపుల్లయ్య యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ముగ్గురు అభ్యర్థులూ బీసీలే కావటం గమనార్హం.
గేట్ వే ఆఫ్ రాయలసీమ - కర్నూలు బురుజుపై జెండా ఎగరేసేదెవరో ? - Kurnool LOK SABHA ELECTIONS
2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలనూ వైసీపీ గెలుపొందింది. ఈ సారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని టీడీపీ పావులు కదుపుతోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్, వైసీపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పోటీ పడుతున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరు నుంచి టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, వైసీపీ తరఫున డాక్టర్ ఆదిమూలపు సతీష్ బరిలో నిలిచారు. ఎమ్మిగనూరులో టీడీపీ తరఫున బీవీ జయనాగేశ్వరరెడ్డి, వైసీపీ నుంచి బుట్టా రేణుక నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి పోటీలో ఉన్నారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి, వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి బరిలో నిలిచారు. ఆలూరులో టీడీపీ నుంచి వీరభద్రగౌడ్, వైసీపీ నుంచి విరూపాక్షి పోటీ చేస్తున్నారు. పత్తికొండ నుంచి టీడీపీ తరఫున కేఈ శ్యామ్ బాబు, వైసీపీ నుంచి కంగాటి శ్రీదేవి తలపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలని తెదేపా పావులు కదుపుతోంటే మరోసారి 7 అసెంబ్లీ, కర్నూలు పార్లమెంటును నిలబెట్టుకోవాలని అధికార ఫ్యాను పార్టీ ఎత్తులు వేస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో దూసుకుపోతున్నారు.
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో ఏటా కరవు తాండవిస్తూనే ఉంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వలసలు సర్వసాధారణంగా మారాయి. గత ఐదేళ్లలో ప్రభుత్వం వలసల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లాకు తాగు, సాగునీరు అందించే గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణానికి గత ప్రభుత్వం పునాదిరాళ్లు వేసినా ప్రభుత్వం వీటి నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో సుమారు 80 వేల ఎకరాలు ఉన్నా డిస్ట్రిబ్యూటరీలు లేకపోవటంతో పొలాలకు నీరు అందని దుస్థితి నెలకొంది. పారిశ్రామిక ప్రగతి గత ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని, హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా మాటలకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అమృత్ పథకాలు అటకెక్కాయి. రహదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2019లో ఏడు అసెంబ్లీ, కర్నూలు పార్లమెంటు స్థానంలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. లోక్ సభ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు నివారించాలని, ప్రాజెక్టులు నిర్మించి తాగు, సాగునీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చేవారికే ఓటు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు.
కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఓటర్లలో చైతన్యం ఎక్కువ. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూనే ఉంది. 2009లో 62.48 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014లో 71.21 శాతానికి చేరి 2019లో 79.65% పోలింగ్ జరిగింది. దీనిని బట్టి ప్రతిసారి జరిగిన ఎన్నికల్లో కూడా కొత్త ఓటర్లు నమోదు అవడం, ఆ కొత్త ఓటర్లు అంతే చురుకుగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసొస్తుంది. ఓటర్లు ఎలాంటి అభ్యర్థిని గెలిపించుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.