Arrangements Completed for TDP, Janasena and BJP Meeting: పల్నాడు జిల్లా బొప్పూడిలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాగళం సభకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రధానిమంత్రికి ఉండే ప్రొటోకాల్ నిబంధనల్ని అనుసరించి సభా ప్రదేశంలో భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర పోలీసులతో పాటు ప్రధాని భద్రతా సిబ్బంది మూడు రోజుల నుంచి సభా ప్రాంగణంలో ఉండి బందోబస్తుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ తదితరులు ఉండి ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన సాయంత్రం 5.15 గంటలకు నేరుగా సభా ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వస్తారు. సభ వద్ద గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు నేతృత్వంలో మొత్తం 14 మంది ఐపీఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు.
ఏపీలో టీడీపీ కూటమిదే విజయం - తెలంగాణలో కాంగ్రెస్ హవా!
రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు: భారీ బహిరంగ సభ దృష్ట్యా పోలీసు అధికారులు రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై నుంచి కోలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారిపై గుంటూరు మీదగా విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు-దిగమర్రు రహదారిపైకి మళ్లించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. కోలకత్తా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు విశాఖపట్నం, మచిలీపట్నం, రేపల్లె, చీరాల, ఒంగోలు మీదగా చెన్నైకి చేరుకోవాలి. కోలకతా వైపు వెళ్లే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం, మైలవరం, హనుమాన్ జంక్షన్, విశాఖ మీదగా వెళ్లాలి.
ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడ వైపు ఎన్‌హెచ్-16 పైగా వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదగా గుంటూరు చేరుకోవాలని అధికారులు స్పష్టంచేశారు. ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడ వైపు ఎన్‌హెచ్-16పైగా వెళ్లాల్సిన వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి, సంతమాగులూరు, నరసరావుపేట బైపాస్, ఫిరంగిపురం, పేరేచర్ల మీదగా గుంటూరు, విజయవాడ తరలించనున్నారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై చిలకలూరిపేట నుంచి మేదరమెట్ల హైవే వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని, ఈ మార్గంలో కేవలం ప్రజాగళం సభా ప్రాంగణానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?
సభకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు: సభికులు అందరికి కనిపించేలా ప్రధానవేదికను ఎత్తులో ఏర్పాటుచేయడంతో వేదిక నుంచి జాతీయ రహదారి వరకు ప్రజలు ఎక్కడున్నా తిలకించే వెసులుబాటు కలగనుంది. సభలో మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఆయా గ్యాలరీలకు రెండు వైపుల నుంచి వెళ్లేందుకు ప్రత్యేకంగా మార్గాలు ఉన్నాయి. వీటి అదనంగా వెనుక వైపు నిలబడేవారికి కొన్ని గ్యాలరీలు ఉన్నాయి. సభలో లక్షలమంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో నాలుగువైపులా డ్రమ్ములు పెట్టి మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉంచారు.
ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి స్థానికంగా భోజన ఏర్పాట్లు చేసుకునేలా నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. సభాప్రాంగణంలో మూడుపార్టీల నేతల భారీ కటౌట్లు పెట్టారు. జాతీయరహదారికి ఇరువైపులా భారీ ప్లెక్సీలతో నేతలు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్దఎత్తున వాటిని ఏర్పాటుచేశారు. సభాప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భారీ హోర్డింగులు పెట్టారు. సభా ప్రాంగణం మూడుపార్టీల ప్లెక్సీలు, జెండాలతో కళకళలాడుతోంది.
కూటమిని ఆశీర్వదించండి - సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: చంద్రబాబు, పవన్
అనుగుణంగా పార్కింగ్ వసతి: మూడుపార్టీలు బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సభకు లక్షలాది మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. సభ నిర్వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంతోపాటు పొరుగు జిల్లా బాపట్ల నుంచి అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనం తరలిరావడానికి ఏర్పాట్లు చేశారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సభకు వచ్చేవారికి రవాణా సౌకర్యాలు కల్పించారు. చిలకలూరిపేట పరిసర నియోకవర్గాల నుంచి ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్దఎత్తున వస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ వసతి కల్పించారు. ఆర్టీసీ, ప్రైవేటు విద్యాసంస్థలు, ట్రావెల్స్ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున లక్షల మంది హాజరవుతున్నందున ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తిచేశారు.