YS Sharmila on Liquor Prohibition : ఏపీ సీఎం జగన్‌ను ప్రతిరోజూ అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు బహిరంగ లేఖ సంధించారు. కొన్ని రోజులు నవ సందేహాల పేరుతో జగన్‌కు బహిరంగ లేఖలు పంపుతూ సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి రెండు సార్లు పలు సమస్యలపై లేఖలు రాశారు షర్మిల. కానీ, జగన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తాజాగా మద్య నిషేధంపై లేఖ రాస్తూ పలు ప్రశ్నలను సూటిగా సంధించారు.
జగన్‌కు షర్మిల మూడో లేఖ : మద్య నిషేధం హామీ ఏమైందంటూ సీఎం జగన్ కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖాస్త్రం సంధించారు. ఒక్కో అంశంపై 'నవ సందేహాలు' పేరుతో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిల నేడు మద్యంపై సీఎంను నిలదీశారు. మద్య నిషేధం పాక్షికంగానైనా అమలవుతుందా? అని ఆమె ప్రశ్నించారు. మూడు దశల్లో మద్య నిషేధం చేస్తామన్నారని ఆ తర్వాతే ఓటు అడుగుతానని ఇచ్చిన హామీ ఏమైందని? లేఖలో అడిగారు.
మద్యం అమ్మకాల్లో రూ. 30 వేల కోట్ల రూపాయలకు ఆదాయం పెంచుకున్నారని విమర్శించారు. మద్యంపై ఆదాయం ప్రజల రక్త మాంసాలపై వ్యాపారమన్న మీరు చేసిందేంటని నిలదీశారు. కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 11 వేల కోట్ల రూపాయలు రుణాలెందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఎందుకుందో చెప్పాలని అన్నారు. 20.19 లక్షల మంది డ్రగ్స్‌కు అలవాటు పడటం మీ వైఫల్యం కాదా? అని సీఎం జగన్‌కు రాసిన లేఖలో షర్మిల ప్రశ్నించారు.
న్యాయం కోసం వైఎస్ వివేకా ఆత్మ ఘోషిస్తోంది : కడపలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ముఖ్యమంత్రి జగన్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ముఖ్యులంతా ఒక ముఠాగా తయారై అధికారాన్ని అక్రమాలకు వినియోగించారని విమర్శించారు. కడప అభివృద్ధిని విస్మరించి కనీసం తాగునీళ్ల ఇవ్వని వైసీపీ ప్రభుత్వాని ఎందుకు ఓటు వెయ్యాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. మద్యంలో తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని తెలిపారు. న్యాయం కోసం వైఎస్ వివేకా ఆత్మ ఘోషిస్తోందని, చట్టసభకు నిందితులు రావొద్దనే తాను పోటీ చేస్తున్నానని మరోసారి తెలిపారు. కడప ఎంపీగా తనని గెలిపించాలని వైఎస్ షర్మిల కోరారు.
నవ సందేహాలకు సమాధానమివ్వండి - ఏపీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ - YS Sharmila Letter To CM Jagan