AP Ministers Performance : సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడంలో తెలుగుదేశం ప్రభుత్వానిది ప్రత్యేక శైలి. చివరి బాధితుడి ముఖంలో నవ్వు చూసే వరకూ విశ్రమించనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడెక్కి వరద బాధిత ప్రాంతాలు నలుమూలల తిరిగారు. ఏ మాత్రం ముందస్తు రూట్ మ్యాప్ లేకుండా వాహనం ఎక్కాక సింగ్ నగర్, మధురానగర్, పైపుల రోడ్డు, అయోధ్య నగర్, ఊర్మిళా నగర్, కబేళా, భవానీ పురం, సితార సెంటర్, స్వాతి థియేటర్, రాజరాజేశ్వరిపేట, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు, ఇలా ప్రతి ప్రాంతం పైనా తనకు పట్టు ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడు తన వాహనశ్రేణిని మళ్లిస్తూ పది రోజుల పాటు చుట్టేశారు.
అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసిన లోకేశ్: ఒక సీఎంకి నగరంలోని ఇన్ని ప్రాంతాలు ఎలా తెలుసంటూ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంచితే సీఎం రోడెక్కి సమస్యల పరిష్కారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుంటే, అధికార యంత్రాంగం మొత్తాన్ని సమన్వయం చేసే తెరవెనుక బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తీసుకున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కలెక్టరేట్‌లోనే ఉంటూ తాను పర్యవేక్షిస్తున్న ఆర్టీజిఎస్ శాఖ ద్వారా ఎక్కడికక్కడ సమాచారం తెప్పించుకుంటూ అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. క్షేత్రస్థాయిలో లోకేశ్ తిరిగింది రెండు మూడు సందర్భాలే అయినప్పటికీ తెరవెనుక శాఖల మధ్య, మంత్రుల మధ్య, సీనియర్ నేతల మధ్య ఎలాంటి ఇగో ఫీలింగులు, సమన్వయ లోపాలు తలెత్తకుండా అన్ని తానై వ్యవహరించారు. మంత్రి లోకేశ్‌కు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తోడుగా ఉన్నారు.
"అదొక దురదృష్టం, ఇదొక అదృష్టం"- బుడమేటికి ఎదురీదిన బాబు - CBN Leadership qualities
రామానాయుడు ఆన్ డ్యూటీ: ఇక రామానాయుడు ఆన్ డ్యూటీ అంటూ జలవనరుల శాఖ మంత్రి బుడమేరు పడిన గండ్లు పూడ్చే వరకూ కట్ట మీదే రోజుల పడి తిష్ట వేసి అన్నీ తానై వ్యవహరించారు. గండ్లు పూడ్చేందుకు ఎదురవుతున్న సవాళ్లను అర్ధమయ్యేలా వివరించడంతో పాటు అందుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు ఇంతకంటే మెరుగ్గా ఆర్మీ సైతం చేయలేదనే విషయాన్ని చాటిచెప్పగలిగారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనునిత్యం తన పరిధిలోని శాఖలతో రాష్ట్ర యంత్రాంగానికి నిశిత పరిశీలనతో దిశా నిర్దేశం చేస్తూ కీలకంగా వ్యవహరించారు. మరో మంత్రి పొంగూరు నారాయణ తనకి అప్పగించిన బాధ్యత పూర్తయ్యే వరకూ ఇంకెవరి మాటా వినను, మరో పనిని ముట్టుకోనంటూ ఎప్పుడు పడుకున్నారో, ఎప్పుడు మెలకువగా ఉన్నారో అన్న తేడా లేకుండా క్షేత్రస్థాయిలోనే సమస్య పరిష్కారంలో మునిగి తేలారు.
వరద తగ్గుముఖం పట్టే వరకూ తన నియోజకవర్గంలో కరకట్టకి కాపలా కాసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ తరువాత ప్రతి బాధితుడికి నిత్యావసరాల కిట్ చేర్చే విషయంలో కీలకంగా వ్యవహరించారు. విపత్తుల శాఖ కూడా చూసే హోం మంత్రి అనిత, తాను నివాసం ఉండే ఇల్లు వరద నీటిలో మునిగినా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజల నీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పని చేశారు. అగ్నిమాపక శాఖ పరికరాల ద్వారా రోడ్లు, ఇళ్లలోని బురదను శుభ్రం చేయించడంతో పాటు సొంత ఖర్చులతో వేలాది మందికి దుస్తులు కూడా పంపిణీ చేశారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతంలో ఉన్న తమ జిల్లా పరిధిలో కరకట్టకు గండి పడకుండా నైట్ వాచ్‌మెన్ల మాదిరి అధికార యంత్రాంగం మొత్తాన్ని కట్ట మీదకి మోహరించి ప్రజలను కాపాడడమే తమ ఏకైక లక్ష్యంగా కాపలాకాశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి లభించిన ప్రచారం కొంతే అయినప్పటికీ, కష్టాల్లో ఉన్న వారికి ఆహారం చేర్చే విషయంలో తెరవెనక, క్షేత్రస్థాయిలోనూ కీలకంగా వ్యవహరించారు.
బాబాయ్ - అబ్బాయ్‌లు మేము సైతం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన శాఖ ద్వారా లక్షల సంఖ్యలో పళ్లు సేకరించి ఇంటింటికీ పంపిణీ చేయిస్తే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందించే విషయంలో కీలకంగా వ్యవహరించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ తదితరులు తమ శాఖలకు సంబంధించిన పని లేనప్పటికీ అప్పగించిన డివిజన్లలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చిత్తశుద్ధితో పనిచేశారు.
స్థానిక ఎంపీ కేశినేని చిన్ని తొలి మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా వ్యవస్థ గాడిన పడే వరకూ విశ్రమించలేదు. వరద తగ్గాక ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్యులు, మందులను మంత్రి సత్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉంచారు.
ట్రాక్టర్లు నడుపుతూ ఆహార ప్యాకెట్లు ఇస్తూ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంతో మంది ట్రాక్టర్లు నడుపుతూ ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారో లెక్కలేదు. ఎక్కడో కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుంచి పారిశుద్ధ్య సిబ్బంది రాత్రికి రాత్రే విజయవాడలో వాలిపోయారు. ఎక్కడో దాచేపల్లి నుంచీ వాటర్ ట్యాంకర్లు దూసుకొచ్చాయి. విశాఖ డైరీ నుంచీ పాల ప్యాకెట్లు, చిత్తూరు నుంచీ కూరగాయలు, ఇలా మేము సైతం అంటూ రాష్ట్రం మొత్తం కదిలొచ్చింది. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని కొంత మంది తిట్టుకున్నా, పరిపాలన విషయంలో తప్పులు చేస్తున్నారని ఇంకొందరు భావించినా, డిజార్డర్ మేనేజ్మెంట్, క్రైసిస్ హ్యాండ్లింగ్‌లో మాత్రం చంద్రబాబు అండ్ కో టీంకు సాటి ఇంకెవ్వరూ రాలేరన్నది తాజా విపత్తు ద్వారా తేటతెల్లమయ్యింది.
"శభాష్ రామానాయుడు"- వరద నియంత్రణ చర్యలపై చంద్రబాబు ప్రత్యేక అభినందనలు - CBN CONGRATULATED NIMMALA