Srikakulam Drainage Cleaning Works: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శ్రీకాకుళం నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మురుగునీటి వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. చిన్నవర్షానికే పొంగి రహదార్లను మురుగునీరు ముంచెత్తేది.
అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టింది. నగరంలో ఉన్న అన్ని ప్రధాన, చిన్న కాలువల ప్రక్షాళనకు నడుంబిగించింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మురుగు కాలువల్లో పూడిక తీత పనులు జోరుగా జరుగుతున్నాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా డ్రైనేజీ వ్యవస్థను గాలికొదిలేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆరోపించారు. ఇప్పుడు 50 లక్షల రూపాయలతో కాలువల్లో పూడిక తీస్తున్నట్లు చెప్పారు.! సాంకేతికతను జోడించి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
నగర పాలికలో మురుగు నీటి వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక రోడ్లపై చెత్తా చెదారంతో నగరం మురిగుకుంటలా ఉండేదని, ఫలితంగా అనేక ఆరోగ్య ఇబ్బందులు తలెత్తేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నగర పారిశుధ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"శ్రీకాకుళంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మురుగు నీటి వ్యవస్థను గాలికొదిలేసింది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగర పారిశుధ్యంపై దృష్టి సారించి మురుగు కష్టాల నుంచి విముక్తి కల్పిస్తోంది." - స్థానికులు
"కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను గాలికొదిలేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం రూ.50లక్షల రూపాయలతో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టింది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం" - గొండు శంకర్, ఎమ్మెల్యే