Pawan Sensational Comments on Telugu Movies : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని పవన్ కోరారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ సమావేశం - Pawan Kalyan Meet Karnataka CM
పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని పవన్ తెలిపారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని, అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీ-కర్ణాటక మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయన్నారు. కర్ణాటక - ఏపీ సరిహద్దులో ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక సహకారం ఇస్తామందని గుర్తుచేశారు. ఎనిమిది కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక ఒప్పుకోవడం సంతోషమన్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఏపీకి చెందిన దాదాపు రూ.140 కోట్ల ఎర్రచందనాన్ని కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అటవీసంపద రక్షణకు సాంకేతికత వినియోగించుకోవటంపై చర్చించాం. ఉపగ్రహ ఆధారిత నిఘాపెట్టే అవకాశాలను తీసుకువస్తామన్నారు. వన్యప్రాణుల స్మగ్లింగ్ చేసే వారిని కట్టడి చేయాలని నిర్ణయించాం, స్మగ్లింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాని హెచ్చరించారు. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు వచ్చే కర్ణాటక భక్తులకు వసతి ఏర్పాట్లు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఎకో టూరిజం అభివృద్ధికి రెండు రాష్ట్రాలు పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
అలాగే పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడువులను సంరక్షించేవాడని, కానీ ఇప్పుడు ఆ అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఓ స్టార్ హీరో సినిమాని ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.
"40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి". - బెంగళూరులో పవన్ కల్యాణ్ కామెంట్స్