TDP Politburo Meeting : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశేష గుర్తింపు పొందిన జన్మభూమి పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. 1995లో తొలిసారి అమలు చేసిన జన్మభూమి ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా జన్మభూమి-2 పేరిట అమలులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించి ముందుకెళ్లాలనే తీర్మానించారు. ఉపాధ్యాయుల హేతుబద్దీకరణపై ఆలోచన చేస్తున్నామన్న నారా లోకేశ్, త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే జన్మభూమి-2 ప్రారంభించనున్నట్లు తెలిపిన చంద్రబాబు, ప్రవాసాంధ్రలోనూ ఉన్నతంగా స్థిరపడిన వారిని ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు.
నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని, త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని సూచనలు చేశారు. 100 రూపాలయ రుసుముతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాదబీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నందున రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పెద్ద పీట వేస్తున్నామని వెల్లడించారు. కొన్ని నామినేటెడ్ పదవులు కొలిక్కి వచ్చాయని టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో అధినేత చంద్రబాబు తెలిపారు. మొదటి దశ నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
తెలంగాణలో పార్డీ బలోపేతంపైనా దృష్టి: దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకు తగ్గుతోందనే అభిప్రాయం పొలిట్‌బ్యూరోలో వ్యక్తమైంది. జనాభా నిష్పత్తి తగ్గడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పార్డీ బలోపేతంపైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానించేలా పొలిట్ బ్యూరోలో ప్రణాళికలు రచించారు. పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టబడిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదనీ, ప్రాణాలకు తెగించి కష్టబడిన కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టంచేశారు. అక్రమ కేసులున్న పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా పరిగణిస్తామన్నారు. రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఇసుక జోలికి వెళ్లద్దని నేతలు మరోసారి గట్టిగానే చెప్పారు.
గ్రామసభల్లో భూ సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం - కేబినెట్ భేటీలో నిర్ణయం - AP Cabinet Decisions
ఎవరి సిఫార్సులతో పనిలేదు: నామినేటెడ్ పదవులకు ఎవరి సిఫార్సులతో పనిలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో కూటమి తరఫున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారన్నారు. అన్ని పనులు వెంట వెంటనే అయిపోవాలని కార్యకర్తలు గాబరా పడుతున్నారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.
జన్మభూమి 2 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. పోలిట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించామని ఆయన తెలిపారు. ప్రాజెక్టులు నిండటంతో, జగన్ గుండె నీరుగారుతోందని అన్నారు. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు.
ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారన్నారు. జనాభా నియంత్రణ వలన డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఒక్క యూపీలోనే 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో 160 మాత్రమే ఉంటాయని అన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానించేలా పొలిట్ బ్యూరోలో ప్రణాళికలు రచించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని నిర్ణయించామని అన్నారు. పార్టీ కోసం కష్టబడిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమని స్పష్టంచేశారు. ప్రాణాలకు తెగించి కష్టబడిన కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అక్రమ కేసులున్న పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా పరిగణిస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తామని కొల్లురవీంద్ర వెల్లడించారు.
పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers