All Parties Focus on Warangal MP Seat : ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన వరంగల్ లోక్‌సభ స్ధానానికి గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. 42 మంది ఆశావహులు టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్, దిల్లీ పెద్దలచుట్టూ తమకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేసినా చివరకు రెండు రోజుల కిందట పార్టీలో కడియం కావ్యను అదృష్టం వరించింది. ఈ మేరకు మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. కడియం శ్రీహరి పెద్ద కుమార్తె అయిన కావ్య ఉస్మానియాలో ఎండీ పాథాలజీ చేసి వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. వర్ధన్నపేట సామాజిక ఆరోగ్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా కుదరలేదు.
వరంగల్ బరిలో కాడియం కావ్య- ఆ 3 సీట్లపై ఇంకా రాని స్పష్టత - lok sabha elections 2024
Congress Revealed Kavya Contest From Warangal : కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యపేరు ఖరారయ్యే క్రమంలో ఎన్నో మలపులు చోటు చేసుకున్నాయి. గత నెల 13న అభ్యర్థిగా కావ్య పేరును బీఆర్ఎస్ ఖరారు చేయడంతో కేసీఆర్‌ను కలిసి పోటీచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కేసీఆర్‌కు లేఖ రాయడం, కడియం శ్రీహరి, కడియం కావ్య రెండు రోజుల కిందట గులాబీ పార్టీ నుంచి వైదొలగి ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరానన్న కడియం దేశంలో, రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.
"దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని దళితులపైన, మైనార్టీలపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంతో కాంగ్రెస్ ముందుంటది. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరాను. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాల్సి ఉంది. అన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరాను." - కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే
BRS Focused on MP Candidate : బీజేపీ తరఫున వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బరిలో నిలిచారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల మద్దతు కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కడియం శ్రీహరినే కారణమని ఆరూరి రమేశ్ విమర్శించారు. కొత్త అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. కడియం పార్టీ మారాక పోటీలో నిలిచేందుకు ఎక్కువ మంది ఆశావహులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా అభ్యర్థి ఎంపికలో అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది. జిల్లా నేతల అభిప్రాయలు సేకరించిన గులాబీపెద్దలు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.
" కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరి ఒక దళిత ద్రోహి. పదవులు అనుభవించి బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని బయటికి పంపడానికి ప్రయత్నం చాలా తెలివిగా చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం శ్రీహరి కుట్ర. మూడోసారి గెలిస్తే మంత్రి అవుతాడు, ఓడిపోవాలని ఇలా చేశారు. ఎంపీ టికెట్ల విషయంలో తెలివిగా పేరు ఖరారు చేశాక ఏం చేశారో అందరికీ తెలుసు." - ఆరూరి రమేశ్, బీజేపీ అభ్యర్థి
అత్యంత తక్కువ సమయంలో కనుమరుగు అవుతున్న పార్టీ బీఆర్ఎస్ : కిషన్ రెడ్డి - LOK SABHA Elections 2024