Congress Focus on Telangana PCC Chief : లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున పీసీసీ అధ్యక్ష పదవి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. ఎన్నికల వేళ పీసీసీ నాయకుడిని మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధిష్టానం సీఎంనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించారు. ఎన్నికలు పూర్తయినందున ప్రభుత్వ పాలన, పార్టీ వ్యవహారాలు రెండింటిని పూర్తి స్థాయిలో చూసుకోవడం కొంత ఇబ్బంది తలెత్తుతుంది. అందుకని నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి.
జూన్ 4న లోక్‌సభ ఫలితాలు రానుండడం, ఆరో తేదీ నాటికి ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ తర్వాత పాలనను పరుగులెత్తించడానికి సీఎం సమాయత్తమవుతున్నారు. అందుకు అనుగుణంగా సమర్థవంతులైన అధికారుల కోసం అన్వేషిస్తున్నారు. సీఎంపై పార్టీపరంగా పనిభారం తగ్గించాలని భావిస్తున్న అధిష్ఠానం వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కినందున పీసీసీ పదవి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Telangana PCC New Chief : పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అది దక్కని పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత జగ్గారెడ్డి తనకు పీసీసీ పగ్గాలిస్తే పార్టీని సమర్థవంతంగా నడుపుతానని దిల్లీ పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికే ఇవ్వాలని భావిస్తే మధుయాష్కీ గౌడ్ పేరును పరిగణలోకి తీసుకంటారని తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ కావున పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సీఎంతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలకమైన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనేది పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కూర్పు కూడా ఈసారి పార్టీకి విధేయులుగా ఉన్నవారికే కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టగలిగే నాయకత్వం పీసీసీ కార్యవర్గానికి ఉండాలని ఏఐసీసీ యోచిస్తోంది. ఆ దిశలోనే కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ ఆశిస్తున్న నాయకులకు సంబంధించి పూర్తి వివరాలు, వారు పార్టీకి చేసిన సేవలు తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో పదవులు అడిగితే ఉన్న పదవి పోతుంది : జగ్గారెడ్డి - Jagga Reddy Comments on BJP