Pratidhwani : నేతల ముసుగులో ప్రాంతానికో అభినవ కీచకుడు రోజుకో వివాదం! అయిదేళ్లు అధికారం అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు సాగించిన రాసలీలలు, రాక్షసపర్వాలు ఇదే రీతిలో ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడో సినిమా హీరోయినే చేరింది. సిగ్గుశరం మరిచి నాటి అధికార పార్టీ నేతల అరాచకాలకు అప్పటి ఖాకీ ఉన్నతాధికారులూ కొమ్ముకాయటం ఎవ్వరూ నమ్మలేక పోతున్నారు. కొన్నిరోజులుగా ఇదే దుమారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
కన్నీటి పర్యంతం అవుతున్న బాధితురాలి దైన్యం చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా. గత ప్రభుత్వ హయాంలో ముంబయికి చెందిన ఈ నటిని వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసులు దారుణంగా వేధించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ పౌర హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తోంది. ఈ యువతి విషయంలో అసలేం జరిగింది? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
వైఎస్సార్సీపీ నాయకుడు, నాటి పోలీసుల తీరుపై తీవ్ర ఫిర్యాదులు చేసిన ముంబయి సినీ విషయంలో ఏం జరిగింది? ఆమె న్యాయవాదిగా మీకు ఆ బాధితురాలు ఏం చెప్పారు? సాధారణంగా ఎక్కడైనా ఆడవాళ్లకు కష్టం వస్తే పోలీసులు, అధికార పార్టీ పెద్దలకు చెబుతారు. ఇక్కడ వాళ్లే నిందితులుగా తీవ్ర అభియోగాలు ఎదుర్కోవడాన్ని ఎలా చూడాలి? కిందిస్థాయి పోలీసు సిబ్బంది తప్పులు చేశారంటే అనుకోవచ్చు కానీ ఇక్కడ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నాటి పోలీసింగ్‌పై ఇదేం చెబుతోంది? ఒక్క కుక్కల నాగేశ్వరరావు ఉదంతమే కాదు కొంతకాలంగా వెలుగు చూస్తోన్న వైఎస్సార్సీపీ నాయకుల రాసలీలలు, రాక్షసపర్వాల డర్టీపిక్చర్‌పై సాధారణ ప్రజలు ఏం అనుకుంటున్నారు? బాధితురాలి ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఇప్పుడేం తేలాలి? దర్యాప్తు ఎలా సాగితే న్యాయం జరుగుతుందనుకుంటున్నారు. విషయం పోలీసులతోనే అయిపోలేదు నాటి ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి పేరూ వినిపిస్తోంది.
ఇంత జరిగినా నాటి ప్రభుత్వపెద్దలకు ఇవేం తెలియలేదా? ప్రభుత్వమూ స్పందించి దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో నేరం నిరూపణైతే నిందితులు, సహకరించిన ఖాకీలు ఎలాంటి పర్యవసనాలు, శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఓ వైపు లేని చట్టం ఉన్నట్లు నమ్మిస్తూ ఐదేళ్లు మహిళల భద్రతను గాలికి వదిలేశారు. మరో వైపు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని బరితెగించి ఊరు మీద పడ్డారు. ఇలాంటి వాళ్లను అసలేం చేయాలి? ప్రజలు ఎలాంటి చర్యలు ఉండాలని అనుకుంటున్నారో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.