Pratidhwani : ఏపీలో ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం ! ఒకటి ఆర్థిక ఆయువుపట్టు, మరొకటి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే జీవనాడి. అందుకే కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతోనే ఈ రెండింటిపైనా ప్రత్యేకదృష్టి పెట్టినట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి 2 కళ్లలాంటి ఈ 2 ప్రాజెక్టులను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తిచేసి ప్రజలకు అంకితమిస్తామని అన్నారు. చెప్పిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా చిక్కుముళ్లు విడదీసుకుంటూ వస్తున్నారు. పరిపాలనా పరమైన, నిధుల పరమైన సవాళ్లను దాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
దాన్లో భాగంగానే పోలవరంపై కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. పోలవరం ఒక పైలట్ ప్రాజెక్టుగా నిలవాలనీ, అదే విధంగా మిగతావాటినీ పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అసలిప్పుడు పోలవరం విషయంలో ఎక్కడున్నాం? ఇకపై ఎలా ముందుకెళ్లాల్సి ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సాగునీటి రంగం నిపుణులు, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టీ లక్ష్మీనారాయణ. మరొకరు పోలవరం సాధికార సమితి కన్వీనర్ ఏ భవానీప్రసాద్.
పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు అడ్వాన్స్ - 75% ఖర్చు చేస్తేనే తదుపరి నిధులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 4నెలలుగా పోలవరం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం వదిలింది అనుకోవచ్చా? పోలవరం విషయంలో రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న డీపీఆర్‌నూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ పరిణామం ప్రాధాన్యత ఏమిటి? పోలవరం డీపీఆర్ ఆమోదం, పెండింగ్ నిధుల విడుదలే కాదు తొలిసారి అడ్వాన్స్ నిధులు ఇచ్చేందుకూ కేంద్రం అంగీకరించింది. మారిన పరిస్థితులపై ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఒక్కటైతే స్పష్టంగా కనిపిస్తోంది. సవాళ్లున్నా సంకల్పబలం, కేంద్రరాష్ట్రాల సహకారపరంగా అయితే అన్నీ సానుకూలతలతే కనిపిస్తున్న వేళ ఇంకా దాటాల్సిన ప్రధాన సవాళ్లేంటి?
పోలవరంలో ఆలస్యానికి తావు లేకుండా మరో సీజన్ నష్టపోకుండా నవంబర్ నుంచే పనులు పున:ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పునరావాస సమస్య ఎలా అధిగమించాలి? అటు పోలవరం విషయంలో కావొచ్చు, ఇటు అమరావతి విషయంలో కావొచ్చు ఈ వేగం, చిత్తశుద్ధి గతప్రభుత్వంలో ఏమైంది? దానివల్ల జరిగిన నష్టం ఏమిటి? పోలవరానికి కావాల్సిన నిధులు అడ్వాన్స్ ఇస్తునే కేంద్రం పెట్టిన ఒక షరతు.. 2026 మార్చి నాటికి తొలి దశ పూర్తి చేయాలని. ఆ వేగం అందుకోవాలంటే ఇకపై పనులు ఎలా సాగాలి? ఇన్ని సానుకూలతల మధ్య కూడా ఇప్పటికీ కొన్ని కోర్టు కేసులు, అంత:రాష్ట్ర కొర్రీలతో పోలవరానికి ఇబ్బందులు కనిపిస్తునే ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనే పలు అంశాలను ప్రతిధ్విని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.
మహానగరికి మహార్దశ - రూ. 2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణం