Pratidhwani : సత్వర న్యాయానికి చక్కటి దారి గ్రామ న్యాయాలయాలు. స్వల్ప స్థాయి నేరాలకు గ్రామ స్థాయిలోనే విచారణ, న్యాయం అందించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్ధేశం. అందుకోసమే గ్రామ న్యాయాలయాల చట్టం-2008ని తీసుకు వచ్చారు. 2009 అక్టోబర్-2 బాపూజీ జయంతి సందర్భంగా అది అమల్లోకీ వచ్చింది. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇప్పుడు దానిపైనే ప్రశ్నించింది. దూరాభారాలకి వెళ్లాల్సిన అగత్యం లేకుండా ప్రజలకు సత్వరన్యాయం అందించే గ్రామ న్యాయాలయాలు అంతటా పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆ పని చేయని రాష్ట్రాలకు నోటీసులు పంపింది సుప్రీం కోర్టు. మరి చెంతకే న్యాయం అందించడం ఎందుకింత సుదూర స్వప్నంగా ఉండిపోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ విశ్రాంత వైస్‌ఛైర్మన్, విశ్రాంత జడ్జి వైవీ రామకృష్ణ మరొకరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల సహాయ ఆచార్యులు పీవీఎస్ శైలజ.
గ్రామన్యాయాల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది? దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 257 విలేజ్ కోర్టులు పని చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల సంగతేంటి? చట్టం అమల్లోకొచ్చిన 15ఏళ్ల తర్వాత కూడా ఎందుకీ పరిస్థితి? చట్టం మేరకు విలేజ్‌కోర్టుల ఏర్పాటు జరిగితే ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఏ ఏ తరహాల కేసులను అవి విచారిస్తాయి? ప్రస్తుతం పనిచేస్తున్న కోర్టుల అనుభవాలేం చెబుతున్నాయి? అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇలాంటి గ్రామ న్యాయాలయాలు లేదా ప్రజల వద్దకే న్యాయాన్నితీసుకుని వెళ్లే వ్యవస్థ ఉందా? చిన్నచిన్న వివాదాలకు కోర్టుల చుట్టు ప్రదక్షిణలు చేస్తూ, ఆస్తులు అమ్ముకుంటున్న వారు ఎందరో.
దీనివల్ల కోర్టులపై ఎలాంటి భారం పడుతోంది? కేసులు తేలడానికి ఎంత సమయం పడుతోంది? ప్రస్తుతం దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య ఎంత ఉంది అది తగ్గాలన్నా, జనాభా అవసరా లకు తగ్గట్లు జడ్జిల సంఖ్య పెరగాలన్నా గ్రామ న్యాయాలయాలను ఎలా బలోపేతం చేయాలి? ఆలస్యమయ్యే న్యాయం అన్యాయంతోనే సమానమన్నది పెద్దలు చెప్పేమాట. తెలుగు రాష్ట్రాల్లో అయినా ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాల ముందున్న కర్తవ్యమేంటి? వీటన్నింటి గురించి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.