Pratidhwani : ఒక పాతిక, ముప్పై ఏళ్ల క్రితం దేశంలో ఐటీ అంటే బెంగళూరు నగరమే ప్రస్తావనకు వచ్చేది. అలాంటి పరిస్థితుల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధినేతగా సైబరాబాద్ నిర్మాణంతో దేశీయ ఐటీ రంగానికే కొత్త దిక్కు చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు. విభజన సమస్యలు, అయిదేళ్ల అరాచక పాలన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ కొత్త బాట చూపించే అవకాశం, బాధ్యత ఇప్పుడు మళ్లీ ఆయన పైనే పడ్డాయి.
మరి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఏం చేయాలి? 2014-19 మధ్య ఆ దిశగా ఎలాంటి కృషి జరిగింది? అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలన ఆ రంగానికి చేసిన నష్టం పూడ్చి, ఐటీలో బ్రాండ్ ఏపీని బలంగా పునర్నిర్మించడం ఎలా? అందుకోసం ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో సింబయోసిస్ టెక్నాలజీస్ సీఈవో ఓ నరేష్ కుమార్, కో ఫౌండర్, రికార్డెంట్ ఇండియా విన్నీ పాత్రో పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.
విజన్-2020 అన్నప్పుడు అందరూ హేళన చేశారు: చంద్రబాబు
బ్రాండ్ ఏపీని తిరిగి బలంగా పునర్నిర్మించాలన్నా, నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నా ఐటీ రంగంలోని అవకాశాలను ఎలా అందుకోవాలి? తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం హయాంలో కూడా ఆర్థిక, ఐటీ రాజధానిగా విశాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడకు మరిన్ని పరిశ్రమల ఆహ్వానించడానికి ఏం చేయాలి? విశాఖపట్నంతో పాటు విజయవాడ, గన్నవరం, మంగళగిరి, తిరుపతి నగరాల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకుని రాబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అందులో ఐటీ రంగానికి ఎలాంటి ప్రోత్సాహం కల్పించాలి? తరలిపోయిన ఎన్నో పరిశ్రమల్ని తిరిగి రప్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాటితో పాటు ప్రవాసాంధ్రులతో రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు, పరిశ్రమల పెట్టించాలంటే ఏం చేయాలి? ఈ అంశాల గురించి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.
రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయంటూ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. గతంలో కర్నాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి ఎక్స్‌లో ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కర్నాటకలో తెచ్చిన కొత్త చట్టంపై పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నాస్కామ్ వంటి సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి విదితమే.