Pratidhwani : చాలాకాలం తర్వాత దేశం మళ్లీ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటోంది. అయిదేళ్ల అరాచకం స్థానంలో తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు, పారిశ్రామిక ఒప్పందాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీకో దండం అంటూ గత ప్రభుత్వహయాంలో వదిలిపోయిన పరిశ్రమలూ తిరిగి ఏపీ వైపు చూస్తున్నాయి. జగన్ అనే విపత్తులో చెల్లాచెదురైన బ్రాండ్ ఏపీని పునర్నిర్మించడంపైనే దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ క్రమంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే శ్రీ సిటీలో ఒకేరోజు 15 సంస్థలు ప్రారంభించారు. మరో ఏడింటికి శంకుస్థాపనల ద్వారా ఫలితాలనూ ప్రజల ముందు పెడుతున్నారు. నూతన పారిశ్రామిక విధానం కోసం కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ మార్పు ఇంకా ఎలా ఉండాలి? పరిశ్రమలు, పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీఐఐ సదరన్ రీజియన్ కమిటీ సభ్యులు సురేష్ చిట్టూరి, సీనియర్ విశ్లేషకులు విద్యాసాగర్.
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి.కేంద్రంలో ఏపీది కీలక భూమిక. ఈ అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఏవిధంగా తోడ్పడతాయి? దేశంలోని పేరొందిన బిజినెస్‌మెన్, వివిధ రంగాల నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి ఈ టాస్క్‌ఫోర్స్ ఏవిధంగా ఉపయోగపడుతుంది? 2014-19 మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్ర టాప్‌లో ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ పెడుతున్నట్లు సీఎం చెప్పారు.
ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? మొన్నటికి మొన్న శ్రీసిటీలో 15 కంపెనీల ప్రారంభోత్సవాలు, ఆరింటికి శంకుస్థాపనలు జరిగాయి. మరో ఐదింటితో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవికాక 70 వేల కోట్లతో బీపీసీఎల్ రాక దాదాపు ఖాయమైంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ మొదలు, సీఐఐ, హెచ్‌సీఎల్, విన్‌ఫాస్ట్ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించారు. ఇవి ఏం సంకేతాలు ఇస్తున్నాయి? అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్ - 2047 ఆవిష్కరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తును ప్రతిబింబించే అవకాశం ఉందా అనేవి నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.