Prathidwani : తన శతృవులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వెతికి వేటాడే అమెరికా ఇప్పుడు బిగ్‌షాక్‌కు గురైంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఉలిక్కిపడింది. 1981లో రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు కానీ అధ్యక్ష అభ్యర్థిని గానీ లక్ష్యంగా చేసుకున్న సందర్భమేదీ లేదు. ఈ ఎటాక్‌తో అమెరికా సీక్రెట్ సర్వీస్‌లో లోపాలు బట్టబయలు అయ్యాయి. మాజీ అధ్యక్షుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతేనా?? గన్ కల్చర్‌పై కూడా మరోసారి చర్చ మొదలైంది.
మాస్ షూటింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన అగ్రరాజ్యం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోందా? ఆ దేశ రాజకీయాలపై ఈ సంఘటన ప్రభావం ఎలా ఉండబోతోంది? అదే నేటి ప్రతిధ్వని అంశం. దీని గురించి ఈ రోజు లైవ్‌లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు సియాచిన్ గ్లేసియర్ వద్ద విధులు నిర్వహించిన సైనికాధికారి, కౌంటర్ టెర్రరిజం- అక్రమ చొరబాట్ల కట్టడిలో నిపుణులు. జమ్ము-కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేసిన కల్నల్ వి.వి.రావు. మరొకరు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వ్యాసకర్త చలసాని నరేంద్ర.
ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓవల్ ఆఫీసు నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 24 గంటల వ్యవధిలో మూడుసార్లు ఆయన ఇలా మాట్లాడారు. హింస దేనికీ సమాధానం కాదని, ఈ తరహా ఘటనలు పునరావృతం కావడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెప్పారు. రాజకీయ వేడి రాజుకోవడం సహజమని, అది శ్రుతి మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. కాల్పుల ఘటనపై వేగంగా, సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.
చెవిపై రక్తమోడుతూ పిడికిలి బిగించి నినదిస్తున్నట్లున్న తన ఫొటో గురించి ట్రంప్ మాట్లాడుతూ అది ఎన్నడూ చూడని అద్భుతమైన చిత్రమని అన్నారు. ‘ఈ మాట చాలామంది ప్రజలు అంటున్నారు. నిజమే. ఎందుకంటే నేను చనిపోలేదు. అలాంటి అద్భుతమైన చిత్రం చిక్కాలంటే సాధారణంగా మనం చనిపోవాల్సి ఉంటుంది! నిజానికి కాల్పుల తర్వాత నేను ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్లాలని సీక్రెట్ సర్వీస్ విభాగం నాపై ఒత్తిడి చేసింది. ఘటనానంతరం అధ్యక్షుడు బైడెన్ నాకు ఫోన్‌చేసి మాట్లాడడం అభినందనీయం. అది చాలా బాగుంది’ అని చెప్పారు. ఇకపై తనకు, బైడెన్‌కు మధ్య పోరు మరింత సభ్యమైన రీతిలో ఉంటుందన్నారు.
గాయమైన కుడిచెవికి ట్రంప్ బ్యాండేజీ వేసుకుని ఉన్నారు. ఆ ఫొటో తీసేందుకు మాత్రం ఆయన సిబ్బంది అనుమతించలేదు. ట్రంప్‌ను పరీక్షించిన వైద్యులు సీటీ స్కాన్ తీసినా దానిలో ఎలాంటి తేడాలు కనిపించలేదు. సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ- ప్రస్తుత తరుణంలో పార్టీ శ్రేణులు, ప్రజలు మరింత ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిజమైన అమెరికా పౌరుల స్వభావాన్ని చాటుకునేలా బలంగా, కట్టుబాటుతో ఉండాలని, దుష్టశక్తులది పైచేయి కానివ్వకూడదని అన్నారు. ట్రంప్ ఏమాత్రం స్థైర్యం కోల్పోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.