Jagan Government is Delaying Land Ownership Rights : ప్రకటనల్లో గొప్పలు. ఆచరణలో మాత్రం శూన్యం! భూ యాజమాన్య హక్కులు లక్షలాది మందికి కల్పిస్తున్నామంటూ ఊదరగొడుతున్న జగన్ సర్కార్ క్షేత్రస్థాయిలో మాత్రం ఏమి కనిపించడం లేదు. ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములకు పట్టాలు సహా సాదాబైనామాల విషయంలోనూ చేసిందేమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకరిపై కక్ష, రైతులకు శిక్ష! - పొలాలకు వెళ్లే దారిని ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీ నేత
Land Ownership Rights : భూ యాజమాన్య హక్కుల కల్పన అనేది జగన్ పాలనలో పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఆశలు రేకెత్తించడం మినహా ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు నిష్ప్రయోజనంగా ఉంటున్నాయి. సాగు భూములు, ఇంటి స్థలాలు, అర్బన్ ల్యాండ్, సాదాబైనామాలపై యాజమాన్య హక్కుల కల్పన కేవలం కాగితాల్లో, ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లాలకు స్పష్టత లేని ఆదేశాలను పంపిస్తోంది. వాటివల్ల ఉపయోగం ఉంటుందా? లేదా? అన్న సమీక్ష చేయడం లేదు. భూములపై లక్షలాది మందికి యాజమాన్య హక్కులు కల్పించేసినట్లు ప్రచారం చేస్తోంది. ప్రజల్ని మాత్రం భ్రమల్లో ముంచెత్తుతోంది. భూముల రీ-సర్వే విషయంలోనూ ఇదే జరిగింది.
Land Issue in AP : నివాసాలకు సంబంధించిన డీకే పట్టాలు పొంది పదేళ్లు దాటితే అర్హులను నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తామని గత ఏడాది సెప్టెంబరులో నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వులు మాత్రం ఆలస్యంగా నవంబరులో ఇచ్చారు. డీకే పట్టాదారుల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించేందుకు జిల్లాల్లో నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటనల్ని చూసి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న పేదలకు నిరాశే ఎదరవుతోంది. ‘చూస్తాం..చేస్తాం.. పై నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉందన్న' అధికారుల సమాధానంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. భూముల రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి నివేశన స్థలాలు పొందిన వారి వివరాలు రికార్డుల్లో పూర్తిస్థాయిలో లేవు. ఈ భూములు చాలావరకు పెద్దల చేతుల్లోనికి వెళ్లాయి. వీటిని కనుగొనేందుకు వైకాపా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో నివాస స్థలాలు పొందినవారు సుమారు 5 లక్షల మంది ఉన్నారని అంచనా. లక్షలాది మంది పేదలకు సంబంధించిన ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో భూకబ్జాలు - మౌనముద్ర వహించిన అధికారులు
Ownership Rights Over Assigned Cultivated Lands : ఎసైన్డ్ సాగు భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 2003 సంవత్సరానికి ముందు పట్టాల జారీ జరిగి 20 ఏళ్లు పూర్తైతే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 27.14 లక్షల ఎకరాలపై 15 లక్షల 21 వేల మందికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని గత ఏడాది నవంబరులో సీఎం జగన్ నూజివీడులో ప్రకటించారు. ఆచరణ మాత్రం పరిస్థితులకు భిన్నంగా ఉంది. అర్హులను గుర్తించే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 28.80 లక్షల ఎకరాల సాగు భూములపై 11లక్షల మంది వరకు మాత్రమే అర్హులు ఉన్నారు.
ప్రకాశం వంటి జిల్లాల్లో కొన్ని మండలాల్లో అసలు లబ్ధిదారులే లేరు. ఆ స్థాయిలో అసైన్డ్ భూములు పేదల నుంచి గల్లంతయ్యాయి. ఓ అంచనా ప్రకారం ఇప్పటికే 40 నుంచి 50 శాతం సాగుభూములు పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలో ఎసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన పెద్దలు పేదల ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తక్కువ ధరలకు భూములను లాగేసుకున్నారు. విశాఖ లాంటి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యల ముసుగులో వైసీపీ నేతలు లబ్ధి పొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
భూ హక్కు చట్టం వల్ల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం : లోక్సత్తా బాబ్జీ
అన్నమయ్య జిల్లా దువ్వూరు మండలంలో 16 వందల మంది లబ్ధిదారులకు 2003కు ముందు అసైన్డ్ సాగు భూములు ఇచ్చారు. వీరికి యాజమాన్య హక్కులు కల్పించే క్రమంలో జాబితాలు పరిశీలిస్తే 300 మంది వరకు మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. ఈ భూములు బడా నేతల చేతుల్లోనికి వెళ్లాయి. బద్వేలు, మైదుకూరు, రాజంపేట, పీలేరు నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ నేతలు 10 లక్షల రూపాయలు విలువ చేసే భూములను కేవలం లక్ష రూపాయలకు పేద రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అడిగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చేలా అనధికారికంగా రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా రికార్డుల్లో ఉన్నట్లు సృష్టిస్తున్న కొందరు వైసీపీ నేతలు లబ్ధిపొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.
పట్టణ భూ గరిష్ఠ పరిమిత చట్టం-యూఎల్‌సీ మిగులు భూముల్లో వెలిసిన ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం భారీగా రుసుములు విధించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావడంలేదు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దరఖాస్తుల స్వీకరణకు గత నెలాఖరుతో గడువు ముగియగా విశాఖలో కేవలం 46శాతం మంది లబ్ధిదారులు మాత్రమే స్పందించారు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాలకు పరిమితమయ్యేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం- 1976లో అమల్లోనికి వచ్చింది. ఒక కుటుంబానికి నిర్దేశిత నివాస స్థలం మాత్రమే ఉండాలన్నప్రధాన షరతుతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ మూడు నగరాల్లో కలిపి సుమారు 2 వేల 505 ఎకరాల మిగులు భూములు సుమారు 8 వేల మంది వద్ద ఉన్నాయి.
గతేడాది ఫిబ్రవరి 24న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో భూముల క్రమబద్ధీకరణకు గతంలో నిర్ణయించిన ఫీజుల్లో కాస్త వెసులుబాటు ఇచ్చింది. పదేళ్ల తరువాత మాత్రమే యాజమాన్య హక్కుల బదలాయింపునకు అనుమతిస్తామని పేర్కొంది. స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా బేసిక్ విలువలో ఒకటిన్నర రెట్లు ఫీజు చెల్లించాలని మెలికపెట్టింది. దీని ప్రకారం భారీగా చెల్లించాలని నోటీసులు రావడంతో మూడు ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. స్థల విస్తీర్ణం అనుసరించి కోటి నుంచి మూడు కోట్ల రూపాయల వరకు చెల్లించాలని నోటీసులు వెళ్లాయి. మూడు జిల్లాల వాసుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంకావడంతో 150 చదరపు గజాల వరకు ఉచితంగా, 150 నుంచి 300 చదరపు గజాల వరకు బేసిక్ విలువలో 15 శాతం, 300 నుంచి 500 చదరపు గజాల వరకు 100శాతం ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఫిబ్రవరిలో జారీచేసిన ఉత్తర్వులు సవరించింది. అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కు బదలాయింపునకు అనుమతి లభిస్తుందని, అప్పటివరకు డికే పట్టాగానే పరిగణిస్తామని మెలికపెట్టడంతో యాజమానులు బెంబెలెత్తిపోతున్నారు.
న్యాయ వ్యవస్థలో జోక్యానికి సీఎం యత్నిస్తున్నారు: నాదెండ్ల మనోహర్
స్టాంపు డ్యూటీలు చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఈ భూముల్లో ఇళ్లు, భవనాలు వెలిశాయి. ఈ పరిస్థితుల్లో వీరికి డికే పట్టా ఇచ్చి, పదేళ్ల అనంతరమే యాజమాన్య బదలాయింపు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం యజమానులను కంగారు పెడుతోంది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూములు ప్రభుత్వ భూమిగా ఉందన్న ఉద్దేశంతో డికే పట్టాగా పరిగణించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మూడుచోట్ల 150 చదరపు గజాలలోపు ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. భూమి ఇంతకంటే ఎక్కువగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు లేదు. యూఎల్‌సీ లెక్కలప్రకారం విశాఖలో 12 వందల 69 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 150 గజాలలోపు 999 మంది, 150 గజాలకుపైబడిన ఆక్రమణదారులు 270 మంది ఉన్నారు. తాము నివాసం ఉండే ఇంటి స్థలం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తే డీకే పట్టా ఎలా ఇస్తారని యజమానులు ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు.
సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఈ భూముల క్రమబద్ధీకరణకు విధించిన గడువు గత నెల 31వ తేదీతో ముగిసింది. నెల్లూరు జిల్లాలో 2018 నుంచి 2022 సంవత్సరం వరకు కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రెవెన్యూ డివిజన్లలో మొత్తం 80వేల మంది దరఖాస్తు చేసుకోగా పరిష్కారమైనవి చాలా తక్కువ. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఓ ప్రహసనంగా జరుగుతుందే కానీ పరిష్కార చర్యలు మాత్రం ఉండడంలేదు. ఈ భూముల క్రమబద్ధీకరణకు 1989 జూన్ నుంచి 2023 నవంబరు మధ్య 16 జీఓలు వెలువడ్డాయి. ఇందులో మూడు జీఓలు ఈ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. పురోగతి మాత్రంలేదు.