How To Avoid Floods To Vijayawada : జనాభా 15లక్షలకు పైమాటే. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం అన్న గుర్తింపు. నగరానికి మణిహారంగా కృష్ణా నది, ఆధ్యాత్మిక క్షేత్రం దుర్గమ్మ సన్నిధి. ఇన్ని ప్రత్యేకతలు కల్గిన ఈ నగరంలోని సగం ప్రాంతాలు ఒకే ఒక్క రాత్రి వచ్చిన వరదతో నిండా మునిగాయి. ఆరు రోజులు కావస్తున్నా ప్రజలు వరద ముంపులో అష్ట కష్టాలు పడుతున్నారు. మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే. నగరం మీదుగా ప్రవహిస్తూ 11లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కృష్ణా నది ప్రశాంతంగా సముద్రం వైపు వెళ్లిపోతే, 30వేల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకోలేక బుడమేరు విజయవాడను ముంచెత్తి తీరని శోకాన్ని మిగిల్చింది. మరి దీనికి కారణాలు ఏమిటని తరచి చూస్తే చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనుషులు చేస్తున్న తప్పులు. జలవనరులను ఎడాపెడా ఆక్రమించి ప్రకృతి విరుద్ధంగా ప్రవహిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఆ తప్పులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
కుంచించుకుపోయిన బుడమేరు : విజయవాడ వాసులకు పీడకలను మిగిల్చిన బుడమేరు స్వరూపాన్ని పరిశీలిస్తే, ఇది ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టి మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవహిస్తుంది. రెడ్డి గూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లోని పులివాగు, భీమ్‌వాగు, లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది. విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి.
ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివార్లలోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠ నీటి సామర్థ్యం 11వేల క్యూసెక్కులు. ఆక్రమణలతో దాని సామర్థ్యం ప్రస్తుతం 6వేల 5వందల క్యూసెక్కులకు కుంచించుకు పోయింది. అయితే భారీ వర్షాలకు గత ఆదివారం రాత్రి సుమారు 30వేల క్యూసెక్కుల వరద రావడంతో దాని సామర్థ్యం సరిపోక నగరాన్ని ముంచేసింది.
వైఎస్సార్సీపీ పాపాలకు ప్రజలకు శిక్ష : బుడమేరు కాలువ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యం కాలువ వెంట విచ్చలవిడి ఆక్రమణలు, విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజల పాలిట శాపమైంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 5వందల కోట్ల రూపాయలతో బుడమేరు ఆధునికీకరణ పనులు ప్రారంభించగా, తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసింది. బుడమేరు పరీవాహక ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు ఇరువైపులా కబ్జాలు చేశారు. నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జెండాలు పాతి మరీ ఆక్రమించారు. అప్పుడు ఓ మంత్రి, ఓ ఎమ్మెల్సీ అనుచరులు విచ్చలవిడిగా ఆక్రమించి విక్రయాలు జరిపారు. సర్వే నెంబరు 32లోని భూమిని నకిలీ పత్రాలతో ఇతర సర్వే నెంబర్లుగా చూపించి విక్రయాలు జరిపారు. దీంతో వాగు కుంచించుకుపోయింది. దీనికి తోడు బుడమేరు వాగుకు పలు చోట్ల గండ్లు పడ్డా, భారీ వరదలు వచ్చినపుడు అవి విజయవాడ నగరాన్ని ముంచెత్తుతాయని తెలిసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలా వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన పాపాలకు ఏ తప్పూ చేయని ప్రజలు ఇప్పుడు శిక్షను అనుభవించాల్సి వస్తోంది.
బుడమేరు ప్రక్షాళనపై దృష్టి సారించాలి : విపత్తులు ప్రజా జీవితానికి నష్టం కల్గించడమే కాదు భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోండని హెచ్చరికలు కూడా జారీ చేస్తాయి. ఆ హెచ్చరికల ద్వారా అప్రమత్తమైతే సరి. లేకుంటే భవిష్యత్తులో మరో విపత్తు సృష్టించే నష్టానికి సిద్ధంగా ఉండాలి. బుడమేరు సృష్టించిన విపత్తు కూడా అలాంటిదే.
విజయవాడకు మరో సారి వరద కష్టం రాకుండా ఉండాలంటే నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలి. వరదలకు కారణం అవుతున్న కబ్జాలను అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం ఆరంభించింది. ఓ వైపు సహాయక చర్యలను కొనసాగిస్తూనే వరదలకు ప్రధాన కారణమైన బుడమేరు గండ్లను పూడ్చే పనిలో నిమగ్నమైంది.
విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. వాగులోని నీరు నగరంలోకి రాకుండా నిలువరించి కొల్లేరు, కృష్ణా నదిలోకి ప్రవేశించేట్టు చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బుడమేరు పరిధిలో నెలకొన్న ఆక్రమణలపై సైతం ఉక్కుపాదం మోపి, ఆ దిశగా ఏవైనా తప్పులు జరుగుంటే చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
బుడమేరు వరదలు దేశానికి ఓ పాఠం : బుడమేరు వరదలు ఒక్క విజయవాడకు మాత్రమే కాదు, యావత్ దేశానికి కూడా ఓ పాఠమే. ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బుడమేరు ఉగ్రరూపాన్ని చూసి అంతా నేర్చుకోవాల్సిన సమయం ఇదే. భారత్‌పై ఇటీవల తరచూ విపత్తులు విరుచుకుపడుతూ నష్టాన్ని కల్గిస్తున్న నేపథ్యంలో అది మరింత అవసరం. ఇందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు, పౌర సమాజం కలిసి వస్తేనే సాధ్యం. అప్పుడే విజయవాడ లాంటి విలయాలు పునరావృతం కాకుండా నిరోధించగలం.