Side Effects of Using Skin Brightening Creams: తెల్లగా మెరిసిపోవాలని.. ప్రతి ఒక్కరూ తమ అందాన్ని గుర్తించాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో అమ్మాయిలే అధికం. అందుకే.. నల్లగా ఉన్నవారు, చామన ఛాయగా ఉన్నవారు.. తెల్లగా కనిపించటానికి మార్కెట్లో లభించే అనేక రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడుతుంటారు. దీనికోసం వేలల్లో ఖర్చు చేస్తుంటారు. అయితే.. ఈ సమస్యకు క్రీమ్స్, బ్లీచింగ్ పరిష్కారం కాదనే విషయం తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా.. చర్మం కమిలినప్పుడో, నల్లమచ్చ ఏర్పడినప్పుడో వీటిని వాడాలని డాక్టర్లు చెబుతారని.. అదికూడా సిఫారసు చేసినంత కాలమే వాడుకోవాలని వివరిస్తున్నారు. అలా కాకుండా సొంతంగా షాపుల్లోంచి క్రీమ్స్ కొనుక్కొని, ఎలా పడితే అలా వాడితే చాలా దుష్ప్రభావాలు తలెత్తొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకు గల కారణాలను వివరిస్తున్నారు.
చాలా ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌లో పాదరసం ఉంటుంది. ఇది భార లోహ విషానికి, కిడ్నీ వైఫల్యానికి దారితీయొచ్చంటున్నారు. అలాగే నరాలు దెబ్బతినడం, కొన్నిసార్లు మొటిమలు, చర్మ అలర్జీకి కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇవి చర్మం మీద ప్రతికూల ప్రభావం చూపి మరింత ఇబ్బందికి గురిచేస్తాయని అంటున్నారు. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) వివరాల ప్రకారం.. ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌లోని పాదరసం కారణంగా.. నరాలు దెబ్బతినడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వంటి పలు సమస్యలు ఇబ్బందిపెడతాయట. ఈ పరిశోధనలో WHOలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్ డాక్టర్ Annette Prüss-Ustün పాల్గొన్నారు.
ఈ పద్ధతులు ట్రై చేయండి: కాబట్టి తెల్లగా మారాలని క్రీమ్స్ ఉపయోగించే బదులు.. సహజ పద్ధతుల్లోనే చర్మాన్ని మెరిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం..
పెరుగు, శనగపిండి:
- పెరుగు, శనగపిండి, కొద్దిగా నిమ్మరసం కలిపి ముద్దగా చేసి చర్మానికి రాసుకోవాలి.
- పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.
- ఈ క్రమంలో ముఖానికి టాల్కమ్ పౌడర్, ఇతర క్రీములు రాసుకోకుండానూ చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎండతో జరిపే ప్రతిచర్య మూలంగా చర్మం మరింత నల్లబడే ప్రమాదముంది.
- ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
నిమ్మకాయ, తేనె: నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమను, ఉపశమనం అందిస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకుగానూ నిమ్మరసం, తేనెను సమభాగాలుగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు అప్లై చేసి.. 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ ఛాయ మెరుగుపడుతుంది.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌కు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి.. ముఖం, చేతులు, మెడ భాగాలలో అప్లై చేసుకుని.. 20 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ తరచూ వేసుకుంటే.. స్కిన్ టోన్ రంగు మారుతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి:
ఫేషియల్ బ్లీచ్ కోసం పార్లర్‌కు అవసరం లేదు - ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
చక్కటి పరిష్కారం : మీ ముఖం వెంటనే జిడ్డుగా తయారవుతోందా? - ఈ ఫేస్‌ప్యాక్స్‌తో తాజాగా మారిపోతుంది!