Psychiatrist Advice for Confused Girl : ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు.. తెలిసీ తెలియని వయసులో ప్రేమ అనే ఒక మాయలో పడిపోతున్నారు. వీరికి సమాజం గురించి పూర్తి అవగాహన ఉండదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేరు. స్కూల్, కాలేజీల్లో ఎవరు ఆప్యాయంగా పలకరించినా, వారిని ఆత్మీయులుగా భావిస్తారు. దీంతో వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు యువకులు.. మాయమాటలు చెప్పి ఊహల్లోకి తీసుకువెళ్తారు. జీవితాంతం.. 'నీతోనే నా అడుగులంటూ' చెప్పి తమ అవసరాలు తీర్చుకుంటుంటారు. తాజాగా ఇటువంటి మాయలో పడిన ఓ అమ్మాయి.. తనకొచ్చిన సమస్యకు పరిష్కారం చెప్పమని నిపుణులను అడుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతోంది. కాలేజీలో ఒకబ్బాయిని ప్రేమించింది. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంట్లోనూ ఒక స్నేహితుడిగా పరిచయం చేసింది. అయితే.. ఆ అబ్బాయి ఈ మధ్య అమ్మాయి న్యూడ్ ఫొటోలు అడుగుతున్నాడట. ఫొటోలు ఇవ్వనంటే 'నా మీద నీకు నమ్మకం లేదా? అని ప్రశ్నిస్తున్నాడట!'. అయితే, ఈ పని చేయడం అమ్మాయికి ఇష్టం లేదు. ఈ మాటలు అబ్బాయి వినడం లేదు. ఇప్పుడు ఏం చేయను ? అని ఆ అమ్మాయి మానసిక నిపుణురాలు సహాయం కోరుతోంది. ఈ సమస్యకు ప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్ స్వాతి పైడిపాటి' ఎలాంటి సమాధానం ఇచ్చారో ఈ స్టోరీలో చూద్దాం..
"విద్యార్థి దశ-దిశ మార్చేది కాలేజీ విద్య. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో బాగా చదువుకుని భావి జీవితానికి పునాది వేసుకోవాలి. ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని చూస్తున్నావు. కాబట్టి, సమాజంలో అన్నింటినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగానీ, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు" అని చెబుతున్నారు.
"నీ ఆలోచన ధోరణి చూస్తుంటే.. పూర్తిగా వ్యక్తిత్వము రూపుదిద్దుకోలేదనిపిస్తోంది. ఎందుకంటే.. కాలేజీలో చాలా పరిచయాలవుతాయి. వారిలో ఎవరిని ఫ్రెండ్స్‌గా చేసుకోవాలో ఆచితూచి నిర్ణయించుకోవాలి. కానీ నువ్వు చాలా వేగంగా అడుగులు వేస్తున్నావు. ప్రేమించడమే కాకుండా..పెళ్లి కూడా చేసుకోవాలనే నిర్ణయాన్నీ తీసేసుకుని ఇంట్లోవాళ్లకీ పరిచయం చేశావు. ఈ వయసుకి ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబు? ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఇప్పటికైనా అర్థమైందా? నిజమైన లవ్ ఇలా అనుచిత కోరికలను కోరదు." - డాక్టర్ స్వాతి పైడిపాటి
వ్యక్తిత్వలోపం ఉన్నవాళ్లే క్షణికావేశాలకు లోనవుతారు. కరెక్ట్ నిర్ణయాలనూ తీసుకోలేరు. ఏ బంధంలోనైనా నమ్మకమే కాదు నైతికతా తప్పకుండా ఉండాలి. ఒక్కసారి అతను అడిగింది చేసి, ఏదైనా చిక్కుల్లో పడితే తర్వాత నీ పరిస్థితేంటి? అందుకే ఇటువంటి స్నేహాలు, ఇష్టాలు, ప్రేమకు దూరంగా ఉండు. నీ అభిప్రాయాలు, విలువలను అర్థం చేసుకుని, నిన్ను నిన్నుగా గౌరవించి, ప్రేమించే వ్యక్తికోసం నిరీక్షించు. ఆ అబ్బాయితో ఇలాంటివి నచ్చవని నేరుగా చెప్పు. కాలేజీలో ఏమైనా ఇబ్బందిపెడితే ఇంట్లోవాళ్లకి విషయం చెప్పి, వారి హెల్ప్‌తో పరిష్కరించుకో. అంతేకానీ గుడ్డిగా ప్రేమ అన్నాడు కదా.. అని అడిగిందల్లా చేస్తూ ఇబ్బందులు మాత్రం పడకని స్వాతి చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
'నన్ను పెళ్లి చేసుకున్నాడు - ఇప్పుడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు' - చట్టం ఎలాంటి సాయం చేస్తుంది??
'భర్త నా మాట వినట్లేదు - అమ్మ, అక్క చెప్పిందే చేస్తున్నాడు- నేనేం చేయాలి'?