Paneer Do Pyaza Recipe in Telugu : పాలకు సంబంధించిన పదార్థాల్లో పనీర్‌ది ప్రత్యేక స్థానం. ఎందుకంటే దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. అందుకే చాలా మంది దానితో చేసే కూరలు, స్వీట్లను ఇష్టపడి తింటుంటారు. అయితే, మీరు ఇప్పటివరకు పనీర్‌తో రకరకాల రెసిపీ ట్రై చేసి ఉంటారు. కానీ, ఈసారి కాస్త స్పెషల్‌గా దాబా స్టైల్ "పనీర్ దోప్యాజా" రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! రోటీ, పులావ్, బిర్యానీ.. ఇలా దేనిలోకైనా ఈ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
గ్రేవీ పేస్ట్ కోసం :
- నూనె - 3 నుంచి 4 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- మిరియాలు - అరటీస్పూన్
- యాలకులు - 4
- ఉల్లిపాయలు - 2
- టమాటాలు - పావుకిలో
- క్యాప్సికం - 1
- కశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
- పసుపు - అరటీస్పూన్
- ధనియాల పొడి - 2 టీస్పూన్లు
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్లు
కర్రీ కోసం :
- పనీర్ ముక్కలు - 300 గ్రాములు
- ఆయిల్ - తగినంత
- ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్‌వి)
- జీలకర్ర - అరటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కసూరీమేథీ - 1 టేబుల్‌స్పూన్
- కశ్మీరీ కారం - 1 టీస్పూన్
- గరంమసాలా - 2 టీస్పూన్లు
- క్రీమ్ - అరకప్పు
- బటర్ - 1 టేబుల్‌స్పూన్
మటర్ పనీర్ గ్రేవీని సింపుల్‌గా చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!
తయారీ విధానం :
- ముందుగా గ్రేవీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలు, టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికంను నిలువు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, యాలకులు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆపై టమాటా ముక్కలు వేసి ఒక నిమిషంపాటు కలుపుతూ మగ్గించుకోవాలి.
- అనంతరం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, కశ్మీరీ కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఆపై పాన్‌పై మూతపెట్టుకొని లో ఫ్లేమ్ మీద టమాటాలు సాఫ్ట్‌గా మారేంత వరకు ఉడికించుకోవాలి. అందుకోసం మూడు నుంచి నాలుగు నిమిషాల సమయం పట్టొచ్చు.
- ఆవిధంగా ఉడికించుకున్నాక ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలిపి మళ్లీ మూతపెట్టుకొని మరో 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అప్పుడు మిశ్రమంలో ఆయిల్ సెపరేట్ అయి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉడుకుతాయి. అలా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న ఉల్లి, టమాటా మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పసందైన "పనీర్ గ్రేవీ కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని మూడు టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక పనీర్ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత కట్ చేయకుండా పాయలు పాయలుగా వీడదీసుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌ మీద కొద్దిగా మందంగా ఉండే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, కొత్తిమీర తరుగు, కసూరిమేథీ, కశ్మీరీ కారం వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లి, టమాటా గ్రేవీ పేస్ట్, గరంమసాలా యాడ్ చేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకనివ్వాలి.
- అనంతరం ఒక చిన్న ముక్క పనీర్ క్యూబ్‌ని తురిమి వేసుకోవాలి. ఆపై క్రీమ్, కొత్తిమీర తరుగు వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి.
- ఆ తర్వాత బటర్, ముందుగా వేయించుకున్న పనీర్ ముక్కలు, ఆనియన్స్ యాడ్ చేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడికించి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ "పనీర్ దోప్యాజా" రెడీ!
నోరూరించే స్పైసీ గోంగూర పనీర్ కర్రీ - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ వేరే లెవల్!