Masala Curd Curry Recipe in Telugu : ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైమ్ లేని సందర్భాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "మసాలా పెరుగు కర్రీ". చాలా రుచికరంగా ఉండే దీన్ని చాలా తక్కువ సమయంలో, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పెరుగు - 1 కప్పు
- నూనె - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
- సన్నని ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 3
- బిర్యానీ ఆకులు - 2
- లవంగాలు - 4
- యాలకులు - 3
- జీలకర్ర - 1 టీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- కారం - రుచికి తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- గరం మసాలా - అరటీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- శనగపిండి - 2 టీస్పూన్లు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
టేస్టీ అండ్ స్పైసీ "పెరుగు ఊర కారం పచ్చడి"- వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో తాజా పెరుగును తీసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా పెరుగులో ఎలాంటి ఉండలు లేకుండా కలిపిపెట్టుకోవడం వల్ల కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా రుచికరంగా వస్తుంది.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆవిధంగా ఆనియన్స్‌ను వేయించుకున్నాక అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకున్నాక అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో శనగపిండిని వేసుకొని కలిపి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పెరుగును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఆపై ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా ఉడికించుకోవాలి.
- అయితే, ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతూ మిశ్రమంలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం 6 నుంచి 7 నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు.
- ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "మసాలా పెరుగు కర్రీ" రెడీ!
- దీన్ని అన్నం, చపాతీ ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది!
పెరుగు మిగిలినప్పుడు పుల్లగా అయిందని పడేస్తున్నారా? - కానీ, ఇలా అద్భుతంగా వాడొచ్చని మీకు తెలుసా?