How to Make Kothimeera Nilava Pachadi : కొత్తిమీర మంచి పోషకాహారం. అయితే.. చాలా వరకు మనం కొత్తిమీరను రుచికోసమో సువాసనకోసమో కూరల్లోనో, సాంబారు, రసాల్లోనో వేస్తుంటాం. నాన్‌వెజ్ వంటకాల్లో అయితే ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ.. అలాకాకుండా కొత్తిమీరతో సూపర్ టేస్టీగా ఉండే పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. రుచి అద్భుతంగా ఉండడమే కాదు ఈ పచ్చడి 2 నుంచి 3 నెలలు నిల్వ ఉంటుంది! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కొత్తిమీర కట్ట - 1(పెద్ద సైజ్‌లో ఉన్నది)
- ఎండుమిర్చి - అర కప్పు
- చింతపండు - పావు కప్పు
- మెంతులు - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
పచ్చడి తాళింపు కోసం :
- ఆయిల్ - 1 కప్పు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- మినప పప్పు - 1 టీస్పూన్
- శనగ పప్పు - 1 టీస్పూన్
- ఇంగువ - పావు టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
- ఎండుమిర్చి - 5 నుంచి 6
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని వేర్లు కట్ చేసుకోవాలి. ఆపై కాడలతో సహా సన్నగా తరుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- అనంతరం ఆ తరుగును మూడు నాలుగుసార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత దాన్ని ఫ్యాన్ కింద పొడి క్లాత్‌పై వేసి రెండు నుంచి మూడు గంటలైనా ఆరనివ్వాలి. అంటే.. కొత్తిమీర తడి లేకుండా పూర్తిగా ఆరాలి. ఎందుకంటే.. తడి తగిలితే పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది.
- ఆవిధంగా కొత్తిమీరను పూర్తిగా ఆరబెట్టుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొలత చూసుకోవాలి. తర్వాత మళ్లీ ప్లేట్లో వేసుకోవాలి. అంటే.. కొత్తిమీర ఆ బౌల్ నిండా వస్తే దాన్ని కొలతగా తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ దాని ప్రకారం తీసుకోవాలి.
- ఇప్పుడు కొత్తిమీర ఏ బౌల్ నిండా వచ్చిందో అదే బౌల్‌తో అరకప్పు ఎండుమిర్చి తీసుకొని చేతితో ముక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం అదే కప్పుతో పావు కప్పు చింతపండును తీసుకోవాలి. ఆపై దాన్ని గింజలు లేకుండా శుభ్రంగా చేసుకొని వేడినీరు పోసి పదినిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అయితే.. చింతపండు నానబెట్టుకోవడానికి చన్నీళ్లు వాడొద్దు. ఎందుకంటే.. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని మెంతులు, ఆవాలు వేసుకొని ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం.. అదే పాన్‌ను మళ్లీ స్టౌపై పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి కాసేపు వేయించుకోవాలి. అవి వేగాక.. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని.. ఆరబెట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- కొత్తిమీర బాగా వేగిందనుకున్నాక.. దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు మళ్లీ అదే పాన్‌ను.. స్టౌపై పెట్టుకొని పచ్చడి కోసం పోపును రెడీ చేసుకోవాలి. ఇందుకోసం పాన్‌లో కొత్తిమీర కొలుచుకున్న బౌల్‌తో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. లేదంటే.. మెజరింగ్ కప్పుతో ఒక కప్పు నూనె తీసుకోవచ్చు.
- నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగ పప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
- అవి వేగాక ఇంగువ, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, తుంచుకున్న ఎండుమిర్చి వేసుకొని మరికాసేపు వేయించుకోవాలి. అవి లైట్‌గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్‌ను దించుకొని పోపును పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఆలోపు మీరు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం.. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఎండుమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, పసుపు, ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు చల్లారిన పోపులో మిక్సీ పట్టుకున్న పచ్చడి, ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మెంతుల పొడి వేసి అన్నీ ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక చివరగా ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని పచ్చడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
- అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "కొత్తిమీర నిల్వ పచ్చడి" రెడీ! దీన్ని అన్నం, టిఫెన్స్, చపాతీ.. ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది.
ఇవీ చదవండి :
పక్కా పల్లెటూరి రుచిలో - నోరూరించే "గోంగూర పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేసుకుంటే వారం నిల్వ!
పచ్చిరొయ్యల నిల్వ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే - నాలుక నాట్యమాడాల్సిందే!