How to Make Pandu Mirchi Pachadi: సాధారణంగానే పచ్చళ్లు, అందులోనూ సీజనల్గా లభించే పచ్చళ్లను చాలా మంది ఇష్టపడతారు. వేడివేడి అన్నంలో కూసింత పచ్చడి వేసుకుని కనీసం రెండు ముద్దలైనా తింటేనే మనసుకు తృప్తిగా ఉంటుందని భావిస్తారు. ఇక ఈ సీజన్లో పండుమిర్చి పచ్చడి స్పెషల్. ఎర్రగా నిగనిగలాడే పండుమిర్చిలతో అద్దిరిపోయే విధంగా నిల్వ పచ్చడి చేసుకుంటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి ఉంటే ఆరోజు గడిచిపోతుంది. అందుకే ఇదీ ఎప్పుడూ బోర్ కొట్టొదు.
అయితే ఈ రోజుల్లో పచ్చడి ప్రిపేర్ చేసుకునే తీరిక లేక కొందరు, పెట్టడం రాక మరికొందరు మార్కెట్లో తయారు చేసిన పచ్చళ్లను కొంటున్నారు. అయితే ఇప్పుడా అవసరం లేకుండా సూపర్ టేస్టీగా పైగా సంవత్సరం నిల్వ ఉండేలా పండు మిర్చి పచ్చడి పెట్టుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- పండు మిర్చి - 1 కేజీ
- చింతపండు - పావు కేజీ(250 గ్రాములు)
- ఉప్పు - పావు కేజీ(250 గ్రాములు)
- పసుపు - 2 టీ స్పూన్లు
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - అర కప్పు
తాలింపు కోసం:
- వేరుశనగ నూనె - 100 గ్రాములు
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఎండుమిర్చి - 5
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా పండు మిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవాలి.
- పూర్తిగా తడి లేకుండా తుడిచిన తర్వాత తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి.
- చింతపండును కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే గింజలు, తొక్కలు, పీచు లేకుండా శుభ్రంగా తీయాలి.
- ఇప్పుడు మిక్సీజార్ తీసుకుని అందులోకి చింతపండు, ఉప్పు వేసి ఓసారి గ్రైండ్ చేయాలి. అయితే ఉప్పు ఒకేసారి వేయకుండా కొంచెం వేసి, మిగిలినది రుచి చూసిన తర్వాత వేసుకోవచ్చు.
- ఆ తర్వాత అందులోకి కట్ చేసిన పండు మిర్చి ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం పసుపు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే తింటున్నప్పుడు రుచి బాగుంటుంది.
- పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచి చూసుకుని సరిపోకపోతే మరికొంచెం ఉప్పు వేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వెంటనే తాలింపు పెట్టకుండా తడి లేకుండా శుభ్రంగా తుడిచిన ఓ గాజు జార్ లేదా జాడీలో వేసి మూత గట్టిగా పెట్టి ఓ రోజంతా ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం వల్ల అన్ని రుచులు సరిగ్గా సరిపోతాయి. అలాగే ఇలా ఊరిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంతమేర తాలింపు పెట్టుకోవచ్చు.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి పచ్చడిని తాలింపులో వేసుకుని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి దింపితే సరి. అంతే ఎంతో రుచికరంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ.
- తాలింపు పెట్టిన పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు గిన్నెలోకి తీసుకుని వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకుని తింటే అమృతమే. నచ్చితే మీరూ ఇప్పుడే ట్రై చేయండి.
అద్దిరిపోయే 'టమాటా నిల్వ పచ్చడి' - ఇలా చేస్తే సువాసనకే నోట్లో నీళ్లు ఊరుతాయి!
"కొత్తిమీర నిల్వ పచ్చడి" - ఇలా చేస్తే వారెవ్వా! - కనీసం 6 నెలలు నిల్వ!