How to Make Palkova at Home : మనలో చాలా మంది స్వీట్షాప్కి వెళ్లినప్పుడు.. అక్కడ ఎన్ని రకాల స్వీట్లున్నా.. పాలకోవాని చూస్తే మాత్రం కళ్లు తిప్పుకోకుండా ఉండలేరు. రేట్ ఎంత ఎక్కువగా ఉన్నా.. కనీసం కొద్దిగా అయినా కొంటారు. ఎందుకంటే.. నోట్లో వేసుకోగానే కరిగే పాలకోవా రుచి అమృతంలా అనిపిస్తుంది. అందుకే స్వీట్లలో పాలకోవాకు అంత డిమాండ్. అయితే, ఇకపై పాలకోవా కావాలంటే స్వీట్ షాప్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కేవలం పాలు, పంచదార ఉంటే చాలు ఎంతో రుచికరంగా దీనిని చేసుకోవచ్చు. అది ఎలా అంటారా ? ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేయొచ్చు. కాకపోతే కాస్త ఓపిక కావాలి. మరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
- చిక్కని పాలు- లీటర్
- చక్కెర-100 గ్రాములు
- యాలకుల పొడి-అరటీస్పూన్
తయారీ విధానం..
- ముందుగా స్టౌపై మందపాటి గిన్నెను పెట్టుకోండి. ఇందులో పాలు పోయండి. పాలకోవా మరింత టేస్టీగా ఉండటానికి మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా ఉపయోగించవచ్చు.
- పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పటి నుంచి చిక్కగా మారేంత వరకు మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూనే ఉండాలి.
- పాలపైన వచ్చే మిగడ గిన్నెకు అతుక్కోకుండా గరిటెతో పాలలోకి మిక్స్ చేస్తూ బాగా మరిగించాలి. ఇలా పాలను గరిటెతో కలపడం వల్ల పాలు మాడిపోకుండా ఉంటాయి. పాలు దగ్గర పడి కోవాగా మారేంత వరకు ఇలానే చేయాలి.
- పాలు దగ్గర పడిన తర్వాత ఇందులో చక్కెర వేసి బాగా కలపండి.
- చక్కెర వేసిన తర్వాత కోవా పల్చగా మారుతుంది. మళ్లీ అలాగే పాలను గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి.
- పాలకోవాని కొద్దిగా చేతిలోకి తీసుకుని ముద్దలా చేయండి. ముద్దగా మారితే కోవా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే. ఈ టైమ్‌లో స్టౌ ఆఫ్ చేయాలి.
- పాలకోవా వేడిగా ఉన్నప్పుడు ఒక గిన్నెతో ప్రెస్ చేస్తూ పూర్తిగా కలపండి.
- కోవా చల్లారిన తర్వాత చేతితో 5 నిమిషాల ప్రెస్ చేసుకోండి. ఇలా కోవాని ప్రెస్ చేసుకోవడం వల్ల పాలకోవా చాలా సాఫ్ట్‌గా వస్తుంది.
- తర్వాత కోవాని మీకు నచ్చిన ఆకారంలో చేసుకుంటే.. ఎంతో తీయని పాలకోవా రెడీ. నచ్చితే మీరు కూడా ఇంట్లో పాలకోవా ఈ విధంగా ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
నోట్లో వేసుకుంటే కరిగిపోయే "డేట్స్ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అమృతమే!
దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్‌దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీగా చేసుకోండిలా!