How to Make Minapappu Fried Rice : సాధారణంగా ప్రతి వంటింట్లో మినప్పప్పు తప్పకుండా ఉంటుంది. ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫెన్లు చేయడానికి ఎక్కువగా మినప్పప్పుని ఉపయోగిస్తుంటాం. అలాగే తాలింపు కోసం కూడా మినప్పప్పు వాడుతుంటాం. అయితే, ఈ మినప్పప్పుతో అద్దిరిపోయే ఫ్రైడ్ రైస్ కూడా చేయొచ్చని మీకు తెలుసా ? అవునండీ.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ మీ ముందుంటుంది. ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పిల్లల లంచ్ బాక్స్ పెడితే.. మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా సింపుల్‌గా టేస్టీ మినప్పప్పు ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై మీరు ఓ లుక్కేయండి..!
కావాల్సిన పదార్థాలు..
- అన్నం -2 కప్పులు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 5
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- మినప్పప్పు - పావు కప్పు
- కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
- చింతపండు - కొద్దిగా
తాలింపు కోసం..
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- ఎండు మిర్చి - 2
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2
- ఉప్పు - రుచికి తగినంత
- ఇంగువ - చిటికెడు
- కొత్తిమీర
తయారీ విధానం..
- ముందుగా స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి కరిగించుకోండి. తర్వాత ఇందులో ధనియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మినప్పప్పు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలి.
- మినప్పప్పు వేగిన తర్వాత పచ్చికొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- మినపప్పు, కొబ్బరి ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి వేసుకుని అందులోనే ముందుగా వేయించిన ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- తర్వాత స్టౌ వెలిగించి కడాయి పెట్టండి. ఇందులో నెయ్యి వేసిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించండి.
- అలాగే కాస్త ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపండి. తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పొడి వేసి కలపాలి.
- తర్వాత ఇందులో రెండు కప్పుల రైస్ వేసుకుని బాగా కలపండి. రైస్‌కి మసాలాలు బాగా పట్టిన తర్వాత కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్టీ మినప్పప్పు ఫ్రైడ్ రైస్. కావాలంటే తాళింపులోకి దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
- నచ్చితే మీరు కూడా ఈ విధంగా మినప్పప్పు ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు - నిమిషాల్లో "ఆనియన్ రైస్" ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!