Kara Boondi Recipe in Telugu: కారం బూందీ.. కరకరలాడుతూ తినేకొద్దీ తినాలనిపించే ఓ స్నాక్. పండగ, ఫంక్షన్, పెళ్లి.. వేడుక ఏదైనా ఇది కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇది చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని కొందరు.. మనం చేస్తే సరిగ్గా రాదని మరికొందరు అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్స్‌కు వెళ్లి తెచ్చుకుంటుంటారు. అయితే ఇకపై బూందీ తినాలంటే కొనే అవసరం లేకుండా.. ఇంట్లోనే ఈ కొలతలతో చేస్తే సూపర్‌గా వస్తుంది. గుండ్రంగా, కారంగా కరకలాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- 200 గ్రాముల శనగపిండి
- 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ
- ఒక టీ స్పూన్ ఉప్పు
- 300 మిల్లీ లీటర్ల నీరు
- పావు కప్పు పల్లీలు (వేరుశెనగ)
- పావు కప్పు జీడిపప్పు
- 5 రెబ్బల కరివేపాకు
- నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
- ఒక టీ స్పూన్ కారం
- కొద్దిగా నల్ల ఉప్పు
- రుచికి సరిపడా ఉప్పు
- పావు టీ స్పూన్ చాట్ మసాలా
తయారీ విధానం
- ముందుగా శనగపిండిని తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. దీంతో పాటు బొంబాయి రవ్వను మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు శనగపిండిలో బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఎలాంటి గడ్డలు లేకుండా బాగా కలపాలి. (పిండిని సరిగ్గా కలుపుకోకపోతే గుండ్రంగా రావు)
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు మరిగే నూనెకు రెండు అంగళాల దూరంలో ఓ జల్లి గంట పెట్టి దానిపై పిండిని నెమ్మదిగా కొద్దికొద్దిగా పోయాలి. ఆ తర్వాత గరిటెతో చిన్నగా తిప్పుతుంటే బూందీ నూనెలోకి పడుతుంది.
- ఇలా లేత గోధుమ రంగులోకి రాగానే కడాయి నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఇదే విధంగా జీడిపప్పు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు కారం, నల్ల ఉప్పు, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బూందీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.