How To Make Garlic Rasam at Home : వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది పొడి దగ్గు, జలుబు వంటి పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వేడివేడి అన్నంలో ఘాటుగా ఉండే "వెల్లుల్లి రసం"తో తింటే కాస్త ఉపశమనం లభిస్తుంది! అయితే, కొందరికి ఈ రసం చేయడం రాదు. అలాంటి వారు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా రసం ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. మరి సూపర్ టేస్టీ వెల్లుల్లి రసం తయారీకి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- జీలకర్ర - 1 టీ స్పూన్
- మిరియాలు - 1 టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 25
- నూనె - ఒకటిన్నర టీ స్పూన్
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు రెమ్మలు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- టమాటా - 1
- చింతపండు - నిమ్మగాయ సైజంతా
- పసుపు - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు - సరిపడా
- తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - 2 రెబ్బలు
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం :
- ముందుగా చింతపండు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి రసం సిద్ధం చేసుకోవాలి.
- అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన ఉంచాలి. టమాటా, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు జీలకర్ర, మిరియాలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఆపై అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కచ్చాపచ్చగా దంచి ఓ గిన్నెలోకి తీసుకోండి.
- రసం చేయడం కోసం స్టవ్ గిన్నె పెట్టండి. ఇందులో నూనె పోసి అది హీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కాడలతో సహా కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి.
- ఆపై దంచిన వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి.
- వెల్లుల్లి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- అనంతరం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించాలి.
- ఇప్పుడు రసంలో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ 15 నిమిషాలు మరిగించుకోవాలి. అనంతరం కాస్త కొత్తిమీర తరుగు వేసి గిన్నె పక్కన పెట్టండి
- ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
- తాలింపు దోరగా వేగిన తర్వాత వేడివేడి రసంలో పోసుకుని కలుపుకోవాలి. అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే ఘుమఘుమలాడే ఘాటైన వెల్లుల్లి రసం మీ ముందుంటుంది.
- ఈ వెల్లుల్లి రసం మీకు నచ్చితే ఓ సారి తప్పక ట్రై చేయండి.
చెట్టినాడ్ స్టైల్ టమోటా, పుదీనా చట్నీ - ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ కాంబినేషన్!
పావ్ భాజీ మసాలా ఇలా రెడీ చేసుకోండి - ఎప్పుడంటే అప్పుడు వేడి వేడిగా తినేయొచ్చు