How To Identify Fake Cashews : వెలుగుల పండగ దీపావళి కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పండగను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది పండగ సందర్భంగా తమకు ఇష్టమైన వారికి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్‌గా అందించి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. అయితే, డ్రై ఫ్రూట్స్‌లో అందరూ ఇష్టంగా తినేది జీడిపప్పు. వీటికి మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ జీడిపప్పు అమ్ముతున్నారు. అయితే, మార్కెట్లో నకిలీ జీడిపప్పును గుర్తించడానికి నిపుణులు కొన్ని టిప్స్ చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీరు చూసేయండి..
కలర్ చూడండి : అసలైన జీడిపప్పు తెల్లగా లేదా క్రీమ్ కలర్లో ఉంటుంది. మీరు మార్కెట్లో కొనే జీడిపప్పు కాస్త పసుపు రంగులో ఉంటే దానిని కొనకపోవడమే మంచిది. ఎందుకంటే పసుపు రంగులో ఉంటే అది నకిలీది కావొచ్చు. కాబట్టి, ఎల్లప్పుడు తెలుపు లేదా క్రీమ్ కలర్లో ఉండే జీడిపప్పు కొనుగోలు చేయండి.
మచ్చలు ఉండవు : నాణ్యమైన జీడిపప్పుపై నలుపు మచ్చలు, రంధ్రాలు ఇవేవీ ఉండవు. నకిలీ జీడిపప్పులపైనే మచ్చలు ఉంటాయి. కాబట్టి, జీడిపప్పు కొనేటప్పుడు వాటిపైన నలుపు మచ్చలు ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చూడండి.
త్వరగా పాడైపోతుంది : మేలు రకం జీడిపప్పు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. అదే నకిలీ జీడిపప్పు త్వరగా పాడైపోతుంది. అలాగే ఇందులో కీటకాలు, పురుగుల వంటివి కూడా ఏర్పడవచ్చు. అయితే, క్వాలిటీ జీడిపప్పు కనీసం 6 నెలల వరకైనా చెడిపోకుండా ఉంటుందట. కాబట్టి జీడిపప్పు కొనేముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించి మంచి జీడిపప్పును కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సైజ్ చూడాలి : మంచి క్వాలిటీ జీడిపప్పు ఒక అంగుళం పొడవు, కాస్త మందంగా ఉంటుంది. చిన్నగా, మందం తక్కువగా ఉంటే అవి ఫేక్ జీడిపప్పు అని గుర్తుపట్టాలి. ఇలా చిన్నగా, మందం తక్కువగా ఉన్నవి కొనుగోలు చేయకపోవడమే మంచిది.
రుచి చూడండి : మీరు మార్కెట్లో జీడిపప్పు కొనేటప్పుడు ముందు.. షాప్ అతని నుంచి రెండు మూడు జీడిపప్పులను అడిగి తినండి. నాణ్యమైన జీడిపప్పు తిన్నప్పుడు అది దంతాలకు అంటుకోదు. అవే ఫేక్ జీడిపప్పులు దంతాలకు అంటుకుంటాయి. అలాగే అసలైన జీడిపప్పులు సులభంగా ముక్కలుగా విరిగిపోతాయి. ఇంకా మంచి జీడిపప్పు రుచి చాలా బాగుంటుంది. నకిలీవి చేదుగా ఉంటాయి.
మంచివి నీటిలో మునిగిపోతాయి : మీరు కొన్న జీడిపప్పు నాణ్యమైందా లేదా అనే విషయం వాటర్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఇందుకోసం ఒక గాజు గ్లాసులో నీటిని నింపి జీడిపప్పులు వేయండి. అరగంట తర్వాత పరిశీలించండి. మంచి జీడిపప్పు నీటిలో మునిగిపోతుంది. నకిలీదైతే పైన తేలుతుంటుంది.
ఇలా కూడా :
- మంచి నాణ్యమైన జీడిపప్పులు కాస్త బరువుగా ఉంటాయి. నకిలీవి చాలా తేలికగా ఉంటాయి.
- అసలైన జీడిపప్పుల పైన మృదువుగా ఉంటుంది. అదే నకిలీ వాటిపైన కొంచెం గరుకుగా ఉండవచ్చు. కాబట్టి, జీడిపప్పు కొనేముందు చేతిలోకి తీసుకుని పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.
చిక్కదనంతో పాటు తక్కువ ధర అని కొంటున్నారా? - ఆ బ్రాండ్ల పాలు కల్తీవట! - జర చూస్కోండి