Home Organising Tips: పండగలు వస్తున్నాయంటే చాలు.. ఇల్లు మొత్తం సర్దేస్తుంటారు. ఏళ్లుగా తిరగేయని పుస్తకాలు, వాడకుండా పడేసిన వస్తువులు, చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపయోగించని వంట పాత్రలు, పాత బట్టలు ఇలా అనేక వస్తువుల దుమ్ము దులిపేస్తుంటాం. ఇంకా తరాలుగా వస్తున్న పాత వస్తువులతో పాటు తక్కువ ధరని, ఆఫర్స్ అంటూ అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా కొనే వాటితో ఇల్లు మొత్తం గోడౌన్‌లా మారిపోతుంది. కేవలం స్టోర్ రూమ్‌లోనే కాకుండా.. అల్మరా, కిచెన్ సొరుగు, బాల్కనీ, మంచం కిందా.. ఇలా ఎక్కడ చూసినా వాడకుండా దాచిన వస్తువులే కనిపిస్తుంటాయి. ఈ గందరగోళానికి చాలా వరకు కారణం మనమే. చాలా వస్తువుల్ని ఎప్పుడైనా అవసరం పడతాయనే ఉద్దేశంతో కొంటుంటాం. కానీ ఏళ్లపాటు ఆరోజు రానే రాదు. మరోవైపు డబ్బు పెట్టి కొన్నాం కదా అని వాటిని పడేయడానికి మనసు రాదు. ఇవి కాకుండా పాత బట్టలు, వినియోగంలోలేని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పిల్లల బొమ్మలు, అలంకార వస్తువులు ఎన్నెన్నో! ఎంత డబ్బు పెట్టి కొన్నా సరే.. అవి కొంత కాలం తర్వాత ఉపయోగపడవు. పండగలప్పుడు ఇల్లు సర్దినప్పుడే ఎంత చెత్త ఉందో గుర్తిస్తాం! అలానే ఏవి పడేయాలో ఓ పట్టాన తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంటాం. ఈ నేపథ్యంలోనే ఇల్లు సర్దుకోవడం గురించి జపాన్‌కు చెందిన ఆర్గనైజింగ్ కన్సల్టెంట్ మారీ కండో 'కాన్‌మారీ' విధానాన్ని రూపొందించారు. ఈమె స్ఫూర్తితో మనదేశంలో కూడా అలాంటి సంస్థలు అనేకం పుట్టుకొచ్చాయి. మరి ఆమె చెబుతున్న సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఇంటిని సర్దే ముందు, ఎలా ఉంటే బావుంటుందని అనుకుంటున్నారో ఊహించుకోవాలని చెబుతున్నారు. రోజూ ఎక్కడ, ఎంత సమయం గడపాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
- కొన్ని వస్తువుల విషయంలో ఉంచాలా, పడేయాలా అనే అయోమయం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి 'కాన్సెప్ట్ ఆఫ్ స్పార్కింగ్ జాయ్'ను పాటించాలని సలహా ఇస్తున్నారు. ఆ వస్తువుని పట్టుకోగానే మనసుకి హాయిగా అనిపిస్తే వాటిని ఉంచాలని అంటున్నారు. అవి జ్ఞాపకాలు, అనుబంధాలకు సంబంధించినవి కాబట్టి అలా అనిపిస్తుందట!
- ఇంట్లోని వస్తువుల్ని భాగాలుగా విభజించి వాటికి ప్రత్యేకమైన చోటుని కేటాయించాలట. అలా చేస్తే ఇల్లు సర్దడం సులభమే కాకుండా తేలిక అవుతుందని చెబుతున్నారు. ఇంకా వస్తువుని వాడాక తిరిగి తీసిన చోటే పెట్టేస్తారని అంటున్నారు.
- పుస్తకాలు, ఇతర కొన్ని వస్తువుల్ని అరల్లో నిలువుగా పెడితే గుర్తించడం తేలిక అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా దుస్తుల్నీ హ్యాంగర్లకు వేలాడదీయాలని ఇలా చేయడం వల్ల ఎంపిక చేసుకోవడం సులభం అవుతుందట.
- స్టేషనరీ, మందులు, పిల్లల బొమ్మలు ఇతర వస్తువల కోసం ప్రత్యేక పెట్టెలు ఉంచితే వాడాక తిరిగి అందులోనే సులువుగా పెట్టేయొచ్చని అంటున్నారు.
- ఇక, అవసరం ఉండవు అనుకున్న వస్తువులను కృతజ్ఞతా భావంతో పడేయాలట. ఆ వస్తువు వల్ల ఎలా, ఎంత మేలు జరిగిందో గుర్తుచేసుకోవాలని.. ఇలా చేయడం వల్ల మనసు తేలిక పడుతుందని వివరించారు.
ఇవీ గుర్తుపెట్టుకోండి
- మనలో చాలా మంది ఇల్లు తరచూ సర్దలేకపోవడానికి ముఖ్యమైన కారణం అది ఒక్క రోజులో అయ్యే పని కాదని. ఇది నిజమే అందుకోసమే వాయిదా పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలని అంటున్నారు. వంటగది, హాల్, బెడ్‌రూమ్, స్టోర్‌రూమ్, బాల్కనీ ఇలా ప్రదేశాలను విభజించుకుని రోజుకొకటి సర్దుకుంటే వారంలో పూర్తయిపోతుందని సలహా ఇస్తున్నారు.
- కేవలం బయటకు కనిపించే వాటినే కాకుండా ఫ్రిజ్ లాంటి లోపలి బాగంపైనా దృష్టి పెట్టాలని అంటున్నారు. ముందుగా దీనిని డిఫ్రాస్ట్ చేసి వేడి సబ్బునీళ్లు, వెనిగర్ కలిసిన ద్రావణంతో శుభ్రం చేయాలని చెబుతున్నారు.
- ఇవే కాకుండా సోఫా, మంచం, కిటికీలు, అద్దాలూ ఇలా ఇంట్లోని ప్రతిదానిపైనా దృష్టి పెడితే మీ ఇల్లు అద్దంలా మెరిసిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
హోర్డింగ్ డిజార్డర్
అంతకుముందు ఎప్పుడో ఆఫర్లకి కొన్న వస్తువుల్ని చాలా మంది తెరవనైనా తెరవరు. పండగ ఆఫర్ అనగానే అవసరం లేని వస్తువులూ కొనేస్తారు. కొనాలన్న ఆ తపన నుంచి.. ఎంత చెప్పినా బయటపడరని.. దీన్నే 'హోర్డింగ్ డిజార్డర్'గా చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 'మన దగ్గర అన్నీ ఉండాలి..' అనే ఆలోచనే దీనికి కారణమని.. అవసరానికి, ఇష్టానికి మధ్య సమన్వయం లోపించి అనవసర వస్తువులు కొనడమే ఈ డిజార్డర్ అని వివరించింది. హోర్డింగ్ డిజార్డర్‌తో డిప్రెషన్, డెమెన్షియా లాంటి సమస్యలూ వస్తాయని హెచ్చరించింది. దీంతో పాటు 'డిజిటల్ హోర్డింగ్' అనే మరో కొత్త సమస్య వ్యాపిస్తుంది. దీని ప్రకారం డిజిటల్ పుస్తకాలు, సినిమాలూ, ఫొటోల్ని ఫోన్లూ, హార్డ్ డ్రైవ్‌లూ, డిస్కుల్లో దాచిపెడుతుంటారు. వాటిని చూసేందుకు సమయమే ఉండదు. అలాగని డిలీట్ చేయకుండా ఫోన్లోనే ఉంచుతారు.
ఫ్రిడ్జ్‌లో పెట్టినా "చపాతీ పిండి" త్వరగా పాడవుతోందా? - ఈ టిప్స్‌తో చాలా ఫ్రెష్‌గా ఉంటుంది!!
ఎంత తొలగించినా ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక!