How to Prepare Chicken Curry in Telugu: మనలో చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో ఉండడం వల్ల మెజారిటీ ప్రజలు చికెన్‌ను ఎక్కువగా తింటుంటారు. అంతకుముందు ఎక్కువగా నాటుకోళ్లనే తినేవారు. చాలా మంది నాన్‌వెజ్‌లో నాటుకోళ్లు వండుకొని తినడానికి ఆసక్తి చూపించేవారు. నిజానికి దీని రుచి కూడా వేరే లెవల్లో ఉంటుంది. కూర, వేపుడు, పలావ్, బిర్యానీ ఏది చేసినా ఆ టేస్ట్ మరో లెవల్. అలా తింటుంటే ఇలా నోట్లోకి వెళ్తూనే ఉంటుంది. అయితే.. మారిన పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ప్రజలు బ్రాయిలర్ చికెన్ తింటున్నారు. కానీ.. సరైన రీతిలో వండితే బ్రాయిలర్ చికెన్‌తోనే నాటు కోడి టేస్ట్ వచ్చేస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కేజీ స్కిన్ చికెన్
- నూనె - సరిపడా
- 2 పచ్చిమిరపకాయలు
- ఒక ఉల్లిపాయ ముక్కలు
- అర టీ స్పూన్ పసుపు
- 3 టేబుల్ స్పూన్ల కారం
- 2 టేబుల్ స్పూన్ల ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ధనియాల పేస్ట్
- ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
- కొద్దిగా కొత్తిమీర
- అర టీ స్పూన్ గరం మసాలా
తయారీ విధానం
- ముందుగా చికెన్‌ను రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
- రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్‌గా అల్లం, వెల్లుల్లి, ధనియాలను కలిపి పేస్ట్‌లాగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి కాసేపు వేయించుకోవాలి.
- అనంతరం శుభ్రం చేసుకున్న చికెన్‌ను ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. (హై ఫ్లేమ్‌లో ఆయిల్ వేరయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి)
- ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి, ధనియాల పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలపి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. (మంటను హై ఫ్లేమ్ నుంచి మీడియంకు తగ్గించాలి)
- ఆ తర్వాత గ్లాసు నీటిని పోసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
- అనంతరం కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
- సుమారు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉంచి స్టౌ ఆఫ్ చేస్తే టేస్టీ చికెన్ కర్రీ రెడీ!
వేడివేడి అన్నంలోకి నల్ల కారం పొడి - కాస్త నెయ్యి తగిలిస్తే ఆహా అనాల్సిందే! - ఇలా ప్రిపేర్ చేయండి
ఉప్మా రవ్వతో నిమిషాల్లోనే వడలు! - టేస్ట్ అద్దిరిపోతుంది - ప్రాసెస్ చాలా ఈజీ!