PM Kisan Maan Dhan Yojana : రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ స్కీమ్స్ రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే సహకారం అందిస్తాయి. మరి, అన్నదాతలు వృద్ధాప్యంలోకి అడుగుపెడితే..? వ్యవసాయం చేయలేకపోతే ఎలా? అనే ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర ప్రభుత్వం.. "ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన(PMKMY)" పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇంతకీ.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అంటే ఏంటి? ఎవరెవరు అర్హులు? ఎలాంటి పత్రాలు కావాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పీఎం మాన్‌ధన్ యోజన అంటే.. చిన్న, సన్నకారు రైతుల కోసం రూపొందించిన పథకం. 60 సంవత్సరాలు నిండిన అన్నదాతలకు ఈ పథకం ద్వారా ప్రతినెలా రూ.3 వేల చొప్పున పెన్షన్ అందుతుంది. సర్కారు ఉద్యోగుల తరహాలో రైతులకు పింఛను ప్రయోజనాలను అందించడమే ఈ పథకం లక్ష్యం.
ఈ పథకానికి అర్హులెవరంటే:
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు అర్హులు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో పేరు ఉండి, వరకు సాగు చేసేందుకు 2 హెక్టార్లకన్నా తక్కువ భూమిని కలిగి ఉండాలి.
వీరు అర్హులు కాదు : ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఈఎస్‌ఐ స్కీమ్, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు, సర్కారు ఉద్యోగులు, జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, మంచి ఆర్థిక స్థితి కలిగిన వారు ఈ పింఛన్ పొందడానికి అనర్హులు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
రైతు పాస్‌పోర్ట్ ఫొటో
ఆదాయ రుజువు
నివాస ధ్రువీకరణ
వయసు నిర్ధారణ
సాగు భూమి వివరాలు
బ్యాంక్ పాస్ బుక్
ఆధార్
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
ఈ పథకం కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఇలా: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి.. మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లాలి. అక్కడ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఇలా: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీ సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్ తీసుకొని అది నింపాల్సి ఉంటుంది. ఫారమ్ పూర్తిచేసి తర్వాత.. అక్కడి CSC ఆపరేటర్ కు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకోసం కాస్త ఫీజు చెల్లించాలి. ఈ వివరాలన్నీ కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం వస్తుంది.
ప్రీమియం ఎంత? : ఈ పథకంలో చేరిన రైతులు వారి వయసు ప్రకారం ప్రతి నెలా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించాలి. రైతు ఎంత చెల్లిస్తారో.. అంత డబ్బును కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది.
ఉదాహరణకు 18 ఏళ్లు రైతు తనవాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే.. తనవాటాగా కేంద్రం రూ.55ను కలిపి బీమా కంపెనీకి రూ.110 చెల్లిస్తుంది. 18 ఏళ్ల రైతుకు ప్రీమియం రూ.55 ఉండగా.. వయసును బట్టి ప్రతీ సంవత్సరం 3 నుంచి 10 రూపాయల వరకు పెరుగుతుంది. 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు : ఈ పథకంలో సభ్యులైన వారు 60 ఏళ్లు పూర్తయిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. ఒకవేళ ఈ స్కీమ్ కోసం నమోదు చేసుకున్న రైతు మరణిస్తే.. అతడి భార్యకు పెన్షన్ మొత్తంలో సగం అంటే.. రూ.1500 లభిస్తుంది. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనది. అంటే రైతులు ఎప్పుడైనా దీన్ని ఆపేసుకోవచ్చు.