Mountain Climber Annapoorna Bandaru: నేనేం సాధించలేనా అనే సందేహం నుంచి, నేను ఏదైనా సాధించగలను అనేలా ఎదిగింది ఈ యువతి. భర్త, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉద్యోగం చేస్తూనే సాహసాలపై ఆసక్తి చూపింది. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను ఎక్కుతూ పలు అవార్డులు, అనేక మంది ప్రశంసలు సొంతం చేసుకుంటుంది అన్నపూర్ణ బండారు.
అన్నపూర్ణ బండారు స్వస్థలం విజయవాడ. చదువుకుంటున్న రోజుల నుంచే చుట్టుపక్కల కొండలు ఎక్కడం అలవాటుగా చేసుకుంది. ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఐతే అన్నపూర్ణ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. దీంతో స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు నువ్వు ఏమీ సాధించలేవని అవమానించేవారు. ఆ అవమానాలనే పాఠాలుగా చేసుకుని, ఉన్నత స్థానంలో ఉండాలని నిర్ణయించుకుంది.
తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం అన్నపూర్ణకు వచ్చింది. అప్పుడే పర్వతారోహణంపై ఆసక్తి పెంచుకుంది. దీనికోసం కావాల్సిన సామాగ్రి తండ్రిని ఒప్పించి కొనుక్కుంది. ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ ప్రయాణంలో తనకి సరైన వ్యక్తిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంకల్పానికి భర్త మహేశ్ రెడ్డి సహకారమూ తోడవ్వడంతో సాహసాలు మెుదలు పెట్టానని చెబుతోంది అన్నపూర్ణ.
కిలిమంజారో, ఎల్‌బ్రస్ పర్వతాల అధిరోహణ: చదువుల్లో రాణించి తనకిష్ణమైన టీచర్ ఉద్యోగంలో ప్రవేశించింది. ఓ ప్రైవేటు స్కూల్లో అలా టీచర్‌గా పని చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల పర్వతాలు అధిరోహించేది. తర్వాత కెరీర్ కోసం భర్తతోపాటు సౌదీ అరేబియా వెళ్లింది. అక్కడా టీచర్‌గా పని చేస్తూనే, పర్వతారోహణకి ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలోనే ఆఫ్రికాలోనే ఎత్తయిన కిలిమంజారో అధిరోహించింది. ఇటీవల యూరప్‌లోనే ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించింది.
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అన్నపూర్ణ అధిరోహిస్తుండటం పట్ల ఈమె భర్త, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణకు పట్టుదల ఎక్కువని, అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతుందని చెబుతున్నారు. అవమానాలకు కుంగిపోకుండా పాఠాలుగా ములుచుకుంటే విజయాలకు అవి కారణం అవుతాయని నిరూపించింది అన్నపూర్ణ. ప్రపంచంలోనే ఎత్తైన 7 పర్వతాల్లో ఇప్పటికే 2 ఇంటిని అధిరోహించింది. ఇదే స్ఫూర్తితో మిగిలిన 5 ఎత్తైన పర్వతాల అధిరోహిస్తానని ధీమాగా చెబుతోంది ఈ సాహసికురాలు.
"మా నాన్న రైల్వో ఉద్యోగి అయినా, చిన్నప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. చిన్నప్పటి నుంచి నాన్న మమ్మల్ని బయటకు తీసుకుని వెళ్లి చాలా ప్రదేశాలు చూపించేవారు. మా నాన్న ఎక్కువగా ప్రకృతిలో గడపడాన్ని ఇష్టపడేవారు. అక్కడ నుంచే నాకు కూడా ఇష్టం ఏర్పడింది. నా భర్త, కుటంబ సభ్యుల ప్రోత్సాహంతో నాలో నేను కొత్త విషయాల్ని తెలుసుకున్నాను. పర్వతారోహణ నాలో ఒక కొత్త ధైర్యాన్ని నింపింది". - అన్నపూర్ణ, పర్వతారోహకురాలు
శభాష్ అనిపిస్తున్న కెనడా కుర్రాడు - పేద విద్యార్థులకు సాయం - NRI Rohan Cherla Helping