How to Make Amla Rice at Home: ప్రస్తుతం మార్కెట్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎక్కువ రోజులు వచ్చేలా ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటుంటారు. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆమ్లా, నెయ్యి వేసుకుని తింటే కలిగే మజానే వేరు. అయితే ఉసిరికాయలతో కేవలం పచ్చడి మాత్రమే కాదు.. ఎన్నో రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. అందులో ఆమ్లా రైస్ కూడా ఒకటి. ఇది లంచ్‌బాక్స్‌లోకి పర్ఫెక్ట్ డిష్. దీన్ని పిల్లలకు లంచ్‌గా పెడితే మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి ఇక లేట్ చేయకుండా సింపుల్‌గా టేస్టీ ఆమ్లా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై మీరు ఓ లుక్కేయండి..!
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - కప్పు
- పసుపు - పావు టీస్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- నువ్వులు- 2 టీ స్పూన్లు
- మిరియాలు- అర టీస్పూన్
- ఉసిరికాయలు - 5
- నువ్వుల నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- పల్లీలు- 3 టేబుల్ స్పూన్లు
- మినపప్పు- 1 టీస్పూన్
- పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
- జీలకర్ర- 1 టీ స్పూన్
- ఎండు మిర్చి - 2
- పచ్చిమిర్చి - 2
- ఇంగువ- చిటికెడు
- కరివేపాకు - రెండు రెబ్బలు
- సాంబార్ పొడి - అర టేబుల్ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఉసిరికాయలను తురిమి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోకి కడిగిన బియ్యం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు కప్పుల నీరు పోసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి అన్నాన్ని చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు, మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాచ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నువ్వుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించుకోవాలి.
- తాలింపు వేగాక జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్ పొడి వేసి కేవలం 30 సెకన్లు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందే గ్రైండ్ చేసుకున్న నువ్వులు, మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులోకి తురుముకున్న ఉసిరి కాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అయితే ఇదంతా స్టవ్ ఆఫ్ చేసే చేయాలి.
- ఆ తర్వాత తాలింపును అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ రైస్ రెడీ. అయితే ఉసిరికాయ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకున్నప్పుడు వేడి మీద రుచి చూస్తే పులుపు అన్నానికి పట్టిందా లేదా అన్నది తెలియదు. కాబట్టి చల్లారిన తర్వాత రుచి చూసి.. ఒకవేళ పులుపు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే మరికొంచెం ఉసిరి తురుము కలుపుకోవచ్చు.
- మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా.. అయితే ఓసారి మీరూ ట్రై చేయండి.!!
మీ పిల్లలకు అద్దిరిపోయే లంచ్ బాక్స్ - పది నిమిషాల్లోనే "గోంగూర రైస్"!