Israel Attacks Iran : ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటోంది ఇజ్రాయెల్. శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈమేరకు అక్కడి మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. "ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఐడీఎఫ్ దాని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దాని మద్దతుదారులు అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్‌పై కనికరం లేకుండా దాడులు చేస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉంది. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తాం" అని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు.
జనరల్ స్టాఫ్ చీఫ్, ఎల్‌టీజీ హెర్జి హలేవీ నాయకత్వంలో ఈ ప్రతీకార దాడులు చేస్తున్నట్లు ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం కమాండింగ్ అధికారి మేజర్ జనరల్ టోమర్ బార్‌తో కలిసి క్యాంప్ రాబిన్‌లోని ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్ సెంటర్ నుంచి దాడులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అయితే ఇరాన్‌పై ప్రతీకార దాడులకు సంబంధించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇజ్రాయల్ దాడులపై ఇరాన్ స్పందించింది. ఇలామ్, ఖుజెస్థాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపిందని తెలిపింది. అయితే ఈ దాడుల కారణంగా పరిమిత స్థాయిలో నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.
విమాన రాకపోకలకు అంతరాయం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఇరాక్ తన విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా, ఇరాక్ గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విమానాల రాకపోకలు నిలిపివేశామని దేశ రవాణాశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అక్టోబరు 1వ తేదీన ఇరాన్ భారీ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. వీటిల్లో కొన్ని లక్ష్యాలకు అత్యంత సమీపంలో పడ్డాయి. మిగిలినవాటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకొన్నాయి. దీనికి ప్రతీకార చర్య తప్పదని టెల్ అవీవ్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ సైన్యాన్ని సిద్ధం చేసిందనే వార్తలు ఆందోళన రేకెత్తించాయి. ఈనేపథ్యంలోనే ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ప్రతీకార దాడులు చేయడం గమనార్హం.