US On Bangladesh Political Crisis : బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుందని, దీంతో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయారన్న ఆరోపణలను వైట్ హౌస్ ఖండించింది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చింది. తమ దేశంపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పేర్కొంది. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి, అమెరికాకు బంగాళాఖాతంలో పట్టులభించేలా చేస్తే తాను ప్రధాని పదవిలో కొనసాగేదాన్నని షేక్ హసీనా ఆరోపించినట్లు వచ్చిన నివేదికలపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ వివరణ ఇచ్చారు. ఇలాంటి ప్రకటన షేక్ హసీనా గానీ, ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ గానీ చేయలేదని తెలిపారు.
'బంగ్లా సంక్షోభంలో అమెరికా ప్రమేయం లేదు'
"బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో అమెరికా ప్రమేయం లేదు. బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో యూఎస్ ప్రమేయం ఉందని వచ్చిన వార్తలు, నివేదికలు తప్పు. అందులో ఎలాంటి నిజం లేదు. వారి నాయకుడిని ఎంచుకోవడం బంగ్లాదేశ్ ప్రజల ఇష్టం. బంగ్లాదేశ్ ప్రజలే వారి ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటారు. అక్కడి పరిస్థితులను అమెరికా పర్యవేక్షిస్తుంది. అధ్యక్షుడు జో బైడెన్ బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల మానవ హక్కుల సమస్యలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు" అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు.
హిందువుల దాడులపై శాంతియుత నిరసనలు
గత కొన్ని రోజులుగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు నగరాల్లో వందలాది మంది హిందూ అమెరికన్లు శాంతియుత నిరసన ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్‌లోని మైనార్టీల భద్రత, శ్రేయస్సు కోసం అమెరికా జోక్యం చేసుకోవాలని ఆదివారం అట్లాంటాలో జరిగిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ సభ్యుడు షాన్ స్టిల్ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ను కోరారు. అలాగే షేక్ హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత హిందువులపై దాడులను అరికట్టడం, వారి ఆస్తులను రక్షించడంలో యూఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ హిందూ-అమెరికన్ గ్రూపులు, భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఖండించిన హసీనా కుమారుడు
కాగా, తన తల్లి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు ఓ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తమని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ తెలిపారు. ఢాకా నుంచి బయలుదేరే ముందు గానీ, తర్వాతగానీ హసీనా ఎలాంటి ప్రకటన చేయలేదని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భారీ ప్రదర్శన - Bangladesh Hindus Protest