US warns To Israel : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న ఇరాన్ దాడికి సిద్ధమైనట్లు అమెరికా నిఘా సంస్థ హెచ్చరించింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా, హెజ్‌బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ హత్యలు ఇజ్రాయెల్ పనేనన్న ఆరోపణల నేపథ్యంలో దాడి చేసేందుకు ఇరాన్‌తోపాటు దాని అనుకూల ఉగ్రసంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తం చేసింది.
ఈ వారంలోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్, దాని అనుకూల తీవ్రవాద సంస్థ హెజ్‌బొల్లా దాడి చేసే అవకాశం ఉందని తమ నిఘా వర్గాలు తెలిపినట్లు అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ఇరాన్ వరుసగా దాడి చేసేందుకు సిద్ధమైందని కిర్బీ తెలిపారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై తాజా సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు తెలియజేస్తామని కిర్బీ చెప్పారు.
ప్రతీకార దాడులకు పాల్పడవద్దని సూచన
ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్, అమెరికా సిద్ధంగా ఉన్నట్లు కిర్బీ వెల్లడించారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గురవారం సమావేశం జరగాల్సి ఉందని, అయితే ఎవరు హాజరవుతారో స్పష్టంగా తెలియలేదన్నారు. ఇరువర్గాల మధ్య చర్చలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కిర్బీ అన్నారు. అమెరికా ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని కిర్బీ స్పష్టం చేశారు. అటు ఇరాన్ సంయమనం పాటించాలని అమెరికాతో సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ దేశాధినేతలు కోరారు. ప్రతీకార దాడులకు పాల్పడవద్దన్న ఐరోపా దేశాల పిలుపును ఇరాన్ తిరస్కరించింది.
యుద్ధం ముగింపు కోసం చర్చలు
మరోవైపు అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను నాలుగు దేశాలు సమర్థించాయి. యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి. తమ దగ్గర ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టాలని, ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉంది
తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అత్యాధునిక జలాంతర్గామితో పాటు విమాన వాహక నౌకను హుటాహుటిన తరలిస్తోంది. ఇప్పటికే బయల్దేరిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీచేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్‌తో ఫోన్ లో మాట్లాడిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.