UK elections 2024 : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 46.5 మిలియన్ల మంది బ్రిటన్ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 40వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా ఉన్న 650 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(44) భవితవ్యం తేలిపోనుంది. ఈ సారి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ పట్ల ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. విపక్ష లేబర్ పార్టీవైపు ఈ సారి ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 14 ఏళ్లపాటు అప్రతిహాసంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, 2019లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. 365 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ 202 సీట్లకే పరిమితమైంది.
గురువారమే పోలింగ్ ఎందుకు?
బ్రిటన్‌లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నుంచి గుర్తింపు కార్డును పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లడం తప్పనిసరి చేసింది బ్రిటన్ ప్రభుత్వం. 1930 నుంచి బ్రిటన్‌లో గురువారం నాడే పోలింగ్ జరుగుతుంది. అసలేందుకు ఇలా గురువారమే ఎన్నికలు జరుగుతాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.
బ్రిటన్‌లో గురువారం అనేక పట్టణాల్లో మార్కెట్ రోజు. ఆ రోజు ప్రజలు మార్కెట్లకు భారీ సంఖ్యలో వెళ్తారు. ఇది కూడా గురువారం ఓటింగ్ జరపడానికి కారణం. అలాగే గురువారం చాలా మంది కార్మికులకు పనిరోజు. దీంతో కార్మికులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతారు. శుక్రవారం, శనివారం, ఆదివారం మత ఆచారాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. అందుకే గురువారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీకెండ్స్‌లో ప్రజలు టూర్స్ వెళ్లే అవకాశం ఉన్నందున అత్యధిక ఓటింగ్ జరగడం కోసం గురువారం ఎన్నికలు జరుపుతున్నారు.
యూకేలో భారీ సంఖ్యలో భారతీయులు
బ్రిటన్‌లో ప్రవాస భారతీయులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరూ కూడా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరు. యూకేలో 19 లక్షల మంది భారతీయ మూలాలున్న ఉన్నవారు నివసిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. కాగా, ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం.
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం - ప్రధాని 'ప్రచండ'కు పదవీ గండం! - Nepal Political Crisis