Reasons For Trump Victory : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయదుందుభి మోగించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ పట్టుదలతో శ్రమించి ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. అధ్యక్ష పదవి చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 270ను దాటేశారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ వైదొలిగిన తర్వాత కమలా హారిస్ రాకతో ట్రంప్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నా, పట్టుదలతో శ్రమించిన ట్రంప్ ఎన్నికల్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.
గ్రోవర్ తర్వాత ట్రంపే
దీంతో అమెరికా చరిత్రలో ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసి, కొంత విరామం తర్వాత మళ్లీధ్యక్షుడైన గ్రోవర్ క్లీవ్‌లండ్ తర్వాత రెండో వ్యక్తిగా ట్రంప్ నిలిచారు. గ్రోవర్ 1884, 1892 ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు. ట్రంప్ 2016లో తొలిసారి అధ్యక్షుడిగాపనిచేశారు. పలు కీలక అంశాలు ట్రంప్ విజయానికి దోహదపడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్రమ వలసలు వంటి పలు అంశాల్లో ట్రంప్ వైఖరి ఓటర్లను ఆకర్షించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసారి ట్రంప్‌నకు యువ ఓటర్ల భారీగా మద్దతు ఇచ్చినట్లు సమాచారం.
ఆర్థిక వ్యవస్థే ప్రధాన సమస్య
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉంది. చాలామంది అమెరికన్లు అధిక ధరలతో సతమతమయ్యారు. నాలుగింట ఒకవంతు అమెరికన్లు మాత్రమే దేశ ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తిగా ఉన్నారు. మూడింట రెండొంతుల మంది ఆర్థిక రంగంపై పెదవి విరిచినట్లు ఓ నివేదికలో తేలింది. ఆర్థిక వ్యవస్థ అంశంలో బైడెన్ ప్రభుత్వంపై అమెరికన్లలో కొంత వ్యతిరేకత ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం రేటింగ్ జాతీయ స్థాయిలో పడిపోయింది. 10 మంది ఓటర్లలో నలుగురు మాత్రమే ఆయన పనితీరును ఆమోదించారు. ఇది ట్రంప్‌నకు కొంత అనుకూలంగా మారింది.
బలహీనంగా మారిన ఆర్థిక వ్యవస్థను ట్రంప్ గాడిన పెట్టగలరని చాలా మంది ఓటర్లు బలంగా నమ్మారు. ఎన్నికల ప్రచారంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థలో సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మీరు మెరుగ్గా ఉన్నారా అంటూ ఓటర్లను ట్రంప్ సూటిగా ప్రశ్నించారు. దిగుమతులపై సుంకాల అంశంలో ట్రంప్‌వైపే ఓటర్లు మెుగ్గు చూపారు.
వలస విధానం విషయంలో ట్రంప్‌పై సానుకూలత
వలస విధానం విషయంలో ట్రంప్‌పై సానుకూలత ఉంది. ఆయన వలస సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరని మెజారిటీ ఓటర్లు బలంగా నమ్మారు. తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపుతానని ట్రంప్ విస్పష్టంగా ప్రకటనలు చేయడం ఆయనకు సానుకూలంగా మారింది. మొత్తం వలస విధానాన్నే మారుస్తానని ట్రంప్ పలు ప్రచారాల్లో తేల్చి చెప్పడం వల్ల శ్వేత జాతి ఓటర్లలో మద్దతు పెరిగింది.
అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారికి జన్మించిన పిల్లలకు ఉన్న జనన హక్కు విధానాన్ని సమీక్షిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. శరణార్థి విధానాలనూ సమీక్షిస్తానని చెప్పడం వంటివి ఓటర్లను ఆకర్షించాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ డిపోర్టేషన్ చేపడతానన్న ట్రంప్, వాగ్దానానికి భారీస్థాయిలో మద్దతు వచ్చింది. అటు బైడెన్ హయాంలో సరిహద్దుల్లో అక్రమ వలసలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విషయంలో ఓటర్లు ట్రంప్‌నే ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు పోల్స్ కూడా చెప్పాయి.
క్యాపిటల్ అల్లర్లు, వరుస కేసుల్లో నేరారోపణలు, ఓ కేసులో దోషిగా తేలడం వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ట్రంప్ దూకుడు కనబర్చారు. ప్రజల్లో ఆయనకు మద్దతు ఏడాది పొడవునా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువే కొనసాగింది. చాలా మంది రిపబ్లికన్లు ఆయన్ను రాజకీయ కుట్రలకు బాధితుడిగా పరిగణించడం ఓటర్లలో సానుభూతి పెరిగింది. యూనియన్ వర్కర్ల వంటి సంప్రదాయ డెమోక్రటిక్ మద్దతుదారులను రిపబ్లికన్ల దిశగా ఆకట్టుకునేందుకు ట్రంప్ కృషి చేశారు. దిగుమతులపై సుంకాల ద్వారా అమెరికన్ పరిశ్రమ వర్గాలను పరిరక్షిస్తానని హామీ ఇచ్చి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
నిరంకుశ నేతలతో స్నేహం చేయడం ద్వారా ట్రంప్ అమెరికా మిత్రపక్షాలను అణగదొక్కారనే ఆరోపణలు ఉన్నా ఆయన మాత్రం అనూహ్య వైఖరినే తన బలంగా ప్రచారం చేసుకున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పెద్ద యుద్ధాలు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. బైడెన్ పాలనలో అమెరికా బలహీనంగా ఉందని, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లకు భారీగా నిధులు పంపుతోందని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ట్రంప్‌నకు కలిసొచ్చింది. మెజారిటీ ఓటర్లు హారిస్‌తో పోలిస్తే ట్రంప్‌ను బలమైన నేతగా పరిగణించారు.
అనుకూలంగా మారిన ముస్లిం ఓటర్లలో బైడెన్‌పై వ్యతిరేకత!
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో బైడెన్ ప్రభుత్వ విధానాల వల్ల అమెరికాలోని ముస్లిం ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది ట్రంప్‌నకు అనుకూలంగా మారింది. ఇజ్రాయెల్ విషయంలో బైడెన్-హారిస్ ద్వయం విధానాల మూలంగా 40వేల మంది పాలస్తీనీయులు హతమయ్యారని అమెరికాలో స్థిరపడిన అరబ్బులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రవాసులంతా డెమోక్రటిక్ పార్టీకి ఓటు వేసేవారే, కానీ, డెమోక్రట్లు పశ్చిమాసియాలో అనుసరించిన విధానాల కారణంగా ప్రవాస అరబ్బులకు వారిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది ట్రంప్‌నకు లాభం చేకూర్చింది. అమెరికా తలరాతను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన మిషిగన్‌లో అధికసంఖ్యలో అమెరికన్ ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరే ఓట్లే మిషిగన్‌లో ట్రంప్‌నకు విజయాన్ని కట్టబెట్టాయి. అరబ్, ఇజ్రాయెల్ పరిణామాలు పెన్సిల్వేనియాలోనూ ప్రభావం చూపాయి. అక్కడ ట్రంప్ వైపే ఓటర్లు మొగ్గుచూపారు.