Sunita Williams May Have To Stay In Space Till February Next Year : మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోనే ఉండనున్నారు.
సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 14న వారు భూమికి తిరిగి రావాల్సింది. అయితే, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో 2 నెలలుగా వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. దీనితో ఈ వ్యోమగాముల రాకపై అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది.
‘‘బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమ్మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకపోతే, ప్రత్యామ్నాయంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో వెనక్కి రప్పించే వీలుంది. 2025 ఫిబ్రవరిలో అందుకు అవకాశం కుదురుతుంది’’ అని నాసా పేర్కొంది. ఈ లెక్కన అప్పటి వరకూ సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రయోగించే వీలుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్‌మోర్‌ను భూమి మీదకు తీసుకురావాలని నాసా ప్రణాళికలు వేస్తోంది. వారిని స్టార్‌లైనర్‌లోనే తీసుకురావాలా? లేక క్రూ డ్రాగన్‌ను ఉపయోగించాలా? అన్నదానిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తొలి మానవసహిత యాత్ర ఇదే!
బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇదే తొలి మానవసహిత యాత్ర. వాస్తవానికి అంతరిక్ష యాత్రకు ముందే హీలియం లీకేజీ కారణంగా స్టార్‌లైనర్ వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైంది. అయినప్పటికీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలో కూడా ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.
మూడో యాత్ర
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.
ఆగస్టు 26న స్పేస్‌ఎక్స్ 'పోలారిస్ డాన్' ప్రయోగం - చరిత్ర సృష్టిస్తుందా? - SpaceX Polaris Dawn
హసీనా గద్దె దిగాక కూడా హింసే- 3రోజుల్లో 232మంది మృతి- ఆజ్యం పోసింది పాకిస్థానే! - Bangladesh Crisis