Rupert Murdoch 5th Marriage : అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 25 ఏళ్లు చిన్నవారైన విశ్రాంత పరమాణు జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో శనివారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహానికి అమెరికా ఫుట్‌బాల్ టీమ్ 'న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్' యజమాని రోబెర్ట్ క్రాఫ్ట్ (82), ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్ (50) హాజరయ్యారు.
మాజీ భార్య ఇచ్చిన పార్టీలో!
రూపర్ట్ మర్దోక్ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే 1960ల్లో వీరు విడిపోయారు. ఆ తర్వాత జర్నలిస్ట్ అన్నా మరియా మన్, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్, అమెరికా మోడల్ జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన రెండో భార్య మన్ నుంచి విడిపోతున్నప్పుడు రూపర్ట్ మర్డాక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటి. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తిని భరణంగా చెల్లించినట్లు సమాచారం. ఇక మర్దోక్ తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్ ఇచ్చిన పార్టీలో జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో వివాహమైంది.
మర్దోక్ ప్రస్థానం
1950ల్లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన మర్దోక్ 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్', 'ది సన్' వార్తా పత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేశారు. 1996లో 'ఫాక్స్ న్యూస్'ను ప్రారంభించారు. 2013లో 'న్యూస్‌కార్ప్'ను స్థాపించారు. మర్దోక్ తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. 2011లో ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం కారణంగా 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' పత్రికను మూసివేయాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలను కలిగి ఉన్న మర్దోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్ 2023లో లెక్కకట్టింది. ఇక గతేడాది సెప్టెంబరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు మర్దోక్. ప్రస్తుతం రూపర్ట్ మర్దోక్ తన సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
చంద్రుడిపై దిగిన చైనా వ్యోమనౌక- అక్కడ మట్టి నమూనాల సేకరణ- చరిత్రలోనే తొలిసారి!
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా- ఈసారి ఏమైందంటే?