Polio In Gaza Strip : అపరిశుభ్ర వాతావరణం కారణంగా గాజా స్ట్రిప్‌లో పోలియో ముప్పు వేగంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఐక్యరాజ్యసమితి, యూనిసెఫ్ ఇతర సంస్థలు హమాస్- ఇజ్రాయెల్ యుద్ధానికి తక్షణ విరామం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఓ పోలియో కేసును అధికారులు నిర్ధరించడం వల్ల వేగంగా టీకాలు వేసి పూర్తి స్థాయి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పేర్కొన్నాయి. గాజాలో పదేళ్ల లోపు ఉన్న 6 లక్షల 40 వేల పిల్లలకు ఈ నెల చివరలో పోలియో టీకాలు వేయాలని నిర్ణయించాయి. ఇందు కోసం ఇజ్రాయెల్-హమాస్ 7 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి. గాజాలోకి 16 లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు తీసుకురావాలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది. యుద్ధానికి ముందు 99 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందనీ, కానీ ప్రస్తుతం అది 86 శాతానికి పడిపోయినట్టు తెలిపింది.
గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ ముట్టడి చేసి దాడులు చేస్తుండటం వల్ల ఎక్కడకు వెళ్లాలో తెలియక వేలాది మంది ఒకే చోట గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. సెంట్రల్ సిటీ డెయిర్ అల్-బలాలో వీధులు మురుగు నీటితో నిండిపోయాయి. రోజూ పిల్లలు, పెద్దలు వీధుల్లో చెత్త కుప్పల మీదుగా నడుస్తున్నారు. మానవ వ్యర్థాలు టెంట్లకు సమీపంలోనే వేస్తుండటం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. గత నెలలో ఆరు వేర్వేరు ప్రాంతాల్లోని నీటిలో సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది.
కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాపించే పోలియో వైరస్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల కోలుకోలేని పక్షవాతం వచ్చే అవకాశముంది. కొన్ని సార్లు మరణానికి దారి తీస్తుంది. 25 సంవత్సరాల క్రితం గాజాలో పోలియోను నిర్మూలించారు. అయితే 10 నెలల క్రితం యుద్ధం ప్రారంభమైన తర్వాత టీకాలు వేయడం తగ్గిపోయాయి. దీంతో గాజా పోలియో వైరస్‌కు సంతానోత్పత్తి కేంద్రంగా మారిందని సహాయక బృందాలు చెబుతున్నాయి.
మరోవైపు 7 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు హమాస్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కైరో వేదికగా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై త్వరలో చర్చలు మళ్లీ మొదలవుతాయని పేర్కొంది. అమెరికా ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం నిర్వహించనున్నాయి.
గాజాలో తీవ్ర సంక్షోభం- ఆహారం కోసం ప్రజల పాట్లు- కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!
గాజాలో మారణహోమం- సాయం కోసం ఎదురుచూస్తున్నవారిపై ఇజ్రాయెల్ దాడి- 70మంది మృతి