Nobel Prize In Medicine 2024 : విఅమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్ వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. మైక్రో RNAను కనుగొని, జన్యు నియంత్రణలో దాని పాత్రను గుర్తించడంపై చేసిన పరిశోధనలకుగానూ ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ స్వీడెన్ రాజధాని స్టాక్హోమ్లో సోమవారం ప్రకటించింది. ఈ ఇద్దరు కనుగొన్న విషయాలు- మనిషి సహా జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పని చేస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు కీలకమని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
నోబెల్ పురస్కార విజేతల్లో ఒకరైన విక్టర్ ఆంబ్రోస్- ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా మైక్రో ఆర్ఎన్ఏపై పరిశోధనలు చేశారు. మరో విజేత అయిన గ్యారీ రువ్కున్- ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రితోపాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఆయన పరిశోధనలు సాగించారు.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 7, 2024
The 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY
భారీ నగదు పురస్కారం
స్వీడెన్కు చెందిన దిగ్గజ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తుగా ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాలు అందిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని నోబెల్ కమిటీ ఇందుకు ఎంపిక చేస్తుంది. సోమవారం వైద్య రంగంలో పురస్కార విజేతల ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సీజన్ ప్రారంభమయ్యింది. అక్టోబరు 14 వరకు రోజూ ఒక్కో రంగంలో పురస్కారం అందుకోబోయే వారి పేర్లను కమిటీ ప్రకటించనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యంలో నోబెల్ అందుకునే వారి వివరాలు తెలియజేయనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఎవరికి దక్కనుందో శుక్రవారం తేలనుంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు విజేత ఎవరో వచ్చే సోమవారం తెలియనుంది. నోబెల్ అవార్డు కింద మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.
గతేడాది వైద్య రంగంలో నోబెల్ పురస్కారం- కాటలిన్ కరికో, డ్రూ విస్మ్యాన్కు దక్కింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టిన mRNA టీకాల అభివృద్ధికి ఉపకరించేలా చేసిన పరిశోధనలకుగానూ వీరిని అత్యున్నత అవార్డు వరించింది.