Iran Israel War US Involvement : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ పేర్కొన్నారు. ఇరాన్, దాని మద్దతుదారులు అమెరికన్ పౌరులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటే వారిని రక్షించేందుకు తాము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాట్ రైడర్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించనున్నట్లు వెల్లడించారు.
తాజాగా తరలిస్తున్న సైనిక సామగ్రిలో దీర్ఘశ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణులను విధ్వంసం చేసే మిషన్లు ఉంటాయని అమెరికా వెల్లడించింది. ఇరాన్‌కు హెచ్చరికగా ఈ సామగ్రిని తరలిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ -THAAD తో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరిన్ని ఆయుధాలు పంపేందుకు సిద్ధమవడం గమనార్హం.
అక్టోబరు 1న టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన నలుగురు సైనికులు మృతిచెందగా, క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయొద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచించాయి. ఈక్రమంలోనే అమెరికా మరింత ఆయుధ సంపత్తిని అందించడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ పత్రిక కథనం ప్రకారం, ఇజ్రాయెల్‌లోని ఏయే లక్ష్యాలను ఢీకొట్టాలో ఓ అవగాహనకు ఇప్పటికే టెహ్రాన్ వచ్చింది. దాడి ప్రణాళికను మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలైన తర్వాతే అమలుపరచాలని భావిస్తోంది. మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు దాడి చేస్తే వాతావరణం ట్రంప్‌నకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నందున దాడిని వాయిదా వేసినట్లు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇటీవల ఓ సమావేశం సందర్భంగా ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలని సైనిక అధికారులను ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఆదేశించినట్లు తెలుస్తోంది.