Modi Meloni Selfie : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి సెల్ఫీ దిగారు. 'మెలోడీ' ట్యాగ్(#Melodi)తో ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెలోడీ మూమెంట్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. దాంతోపాటు మెలోనీ తన సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోతోపాటు వీడియో వైరల్‌గా మారాయి.
ఇటలీలోని అపులియా వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఈ సెల్ఫీ వీడియోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. 'హాయ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ మెలోడీ' అని క్యాప్షన్ ఇచ్చారు.
కాప్ 28 సదస్సులోనూ ట్రెండ్!
గతేడాది డిసెంబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన కాప్28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయింది. మోదీతో తీసుకున్న స్వీయ చిత్రాన్ని మెలోనీ ఎక్స్‌లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. అప్పటి నుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది. కాగా నాటి ఫొటోపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. '‘స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది' అని బదులిచ్చారు.
ఇక, జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీబిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. వరుసగా మూడో దఫా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు నరేంద్ర మోదీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆ కలకలం తర్వాత ట్రూడోతో తొలిసారి!
మరోవైపు మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల భేటీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ ఖలిస్థానీ వేర్పాటువాది హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో నిరుడు ఆరోపించడం కలకలం సృష్టించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలకు బీటలు వారేలా చేసింది. అప్పటి నుంచి మోదీ, ట్రూడో నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా-2, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌లతోనూ మోదీ జీ7 సదస్సు వేళ విడివిడిగా సమావేశమయ్యారు.
జీ7 సమ్మిట్‌లో దేశాధినేతల మోదీ చర్చలు- ఏఐపై కీలక సందేశం - g7 summit 2024