Who Is Keir Starmer New UK PM : బ్రిటన్‌లో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ దూకుడుకు లేబర్ పార్టీ కళ్లెం వేసింది. అందుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తి లేబర్ అధినేత కీర్ స్టార్మర్(61). ఆయనే బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే కీర్ స్టార్మర్ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారత్‌తో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే లేబర్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాల్లో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడం వల్ల భారత్- యూకే మధ్య మంచి బంధం ఏర్పడనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తదుపరి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే కీర్ స్టార్మర్ వ్యక్తిగత విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లండన్ రాణి చేతుల మీదుగా అవార్డు
1962 సెప్టెంబరు 2న కీర్ స్టార్మర్ జన్మించారు. ఆయన తండ్రి టూల్ మేకర్, తల్లి నర్సు. ఆమె అరుదైన వ్యాధితో బాధపడేవారు. కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే. న్యాయవిద్యను అభ్యసించిన ఆయన చదువు పూర్తయిన తర్వాత 2003లో నార్తన్ ఐర్లాండ్ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు. ఐదేళ్ల తర్వాత లేబర్ పార్టీ నాయకుడు, ప్రధాని గార్డెన్ బ్రౌన్ హయాంలో ఇంగ్లాండ్, వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నిధులను దుర్వినియోగం చేసే ఎంపీలు, ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షలు వేయించి వార్తల్లో నిలిచారు. న్యాయవృత్తిలో ఆయన చేసిన సేవలకు గానూ 2014లో బ్రిటన్ రాణి ఎలిజెబెత్- 2 నుంచి నైట్ హుడ్ అవార్డు అందుకున్నారు. 2015లో ఆయన ఎంపీగా గెలవడానికి కొద్ది నెలల ముందే తల్లి దూరమైంది. ఆ బాధను బిగపట్టి ప్రచారంలో పాల్గొన్నారు. స్టార్మర్‌కు భార్య విక్టోరియా, ఇద్దరు పిల్లలున్నారు.
2015లో రాజకీయాల్లోకి- 9 ఏళ్లలో ప్రధాని పీఠం
2015లో కీర్ స్టార్మర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో తొలిసారి ఉత్తర లండన్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే లేబర్ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ పార్టీ విజయం సాధించడం వల్ల ప్రధాని కాబోతున్నారు. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయంలో కీర్ స్టార్మర్ దే కీలకపాత్ర. ఆయన తన ప్రసంగాల్లో యూకేలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామనే హామీతో ముందుకెళ్లారు. కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న అస్థిరతను ఎత్తిచూపారు. ఇవన్నీ లేబర్ పార్టీ విజయానికి కీలకంగా నిలిచాయి.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ షురూ- ప్రతిసారి గురువారమే ఎందుకు జరుగుతాయి? - UK elections 2024