Joe Biden on World Leadership : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ ఖండించారు. అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు.
ఎన్నికలపై అందరి దృష్టి
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ అన్నారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని వెల్లడించారు. యావత్ ప్రపంచం అమెరికావైపే చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే, ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని బైడెన్ తెలిపారు. ఇప్పటి వరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్లకు దిగువనే ఇచ్చారని జో బైడెన్ చెప్పారు.
పోల్స్ మాకే అనుకూలం
ఇక అనేక సర్వేల్లో ట్రంప్ కంటే తానే ముందున్నానని బైడెన్ అన్నారు. 'ఇప్పటి వరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్‌లో పదింటిలో నేనే ముందున్నాను. డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదింటిలో ఆధిక్యంలో ఉన్నారు. ఐదింటిలో టై అయ్యింది. కచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్ పోల్‌లో మా పార్టీ ఎనిమిది పాయింట్లుకు చేరింది. ఎకెలన్ పోల్‌లో ఏడు పాయింట్లు మెరుగయ్యాం. మార్టిస్ట్ పోల్‌లో మూడు పాయింట్లు పెరిగాయి' అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించారు.
బైడెన్‌పై ప్రజలు అసంతృప్తి
అయితే ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వేలో జో బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు ఒపీనియన్ పోల్‌లో తెలిసింది.
CAA, మణిపుర్ అంశాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు- నివేదికల్లో ప్రస్తావన - US On Manipur Violence