Hamas Government Chief Death : హమాస్ కీలక నాయకత్వాన్ని అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ తరఫున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహాను చంపేసినట్లు వెల్లడించింది. మూడు నెలల క్రితం జరిపిన వైమానిక దాడిలో ముష్తాహా సహా ముగ్గురు కమాండర్లు చనిపోయారంటూ వారి ఫొటోలు, వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిపిన బాంబు దాడిలో ఓ అపార్టమెంట్ ధ్వంసం కాగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్‌లోని ఐరాస బఫర్ జోన్‌కు ఉత్తరాన ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలని గురువారం హెచ్చరికలు జారీ చేసింది.
మూడు నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో గాజాలో హమాస్ తరఫున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి. ముష్తాహాను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు దాడిలో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్‌నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ చనిపోయినట్లు తాజాగా ఐడీఫ్ ధ్రువీకరించింది. వీరంతా సొరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు కచ్చితమైన సమాచారం లభించింది. దీంతో ఫైటర్ జెట్ల సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మరోవైపు హమాస్ మాత్రం వీరి మరణాలను ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. దీంతో ఆ మిలిటెంట్ సంస్థ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా నష్టాలను దాస్తోందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ముష్తాహా కీలక పాత్ర
వాస్తవానికి రావీ ముష్తాహా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌కు ప్రధాన అనుచరుడిగా భావిస్తారు. వీరిద్దరు కలిసి ఇజ్రాయెల్ జైల్లో సుదీర్ఘకాలం ఉన్నారు. ఆ తర్వాత వీరే హమాస్ జనరల్ సెక్యూటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యుద్ధ సమయంలో గాజాలో ప్రజలను నియంత్రించడంలో ముష్తాహానే కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ముష్తాహా మృతితో హమాస్ దళాల మోహరింపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, హమాస్ ప్రధాన నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నారు. ఇప్పటికే యాహ్యా సిన్వార్ జాడ లేకుండా పోయింది. గత ఏడాది అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సిన్వార్ ప్రస్తుతం గాజా పట్టీలోని బంకర్లలో ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది.
దక్షిణ బీరూట్‌పై దాడి
లెబనాన్ రాజధాని దక్షిణ బీరూట్‌పై ఇజ్రాయెల్ గురువారం మరోసారి బాంబు దాడికి దిగింది. ఈ దాడిలో లెబనాన్ పార్లమెంటు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనం తీవ్రంగా దెబ్బతినగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిలో గాయపడిన వారి ఆస్పత్రికి తరలిస్తుండగా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. ఈ ఘటనలో లెబనాన్ సైనికుడు మృతి చెందగా, నలుగురు వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఆ గ్రామాలను ఖాళీ చేయండి
మరోవైపు లెబనాన్‌లోని ఐరాస ప్రకటించిన బఫర్ జోన్‌కు ఉత్తరాన ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను పంపేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే రిజర్వు బలగాలను సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది.