Israeli forces withdraw from Jenin : గత 9 రోజులుగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో చేపట్టిన ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ సైన్యం ముగించింది. అంతేకాదు ఆ నగరం నుంచి తమ సైనిక దళాలను శుక్రవారం ఉపసంహరించుకుంది. మరోవైపు వెస్ట్‌బ్యాంక్‌లో ఆందోళకారులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 26 ఏళ్ల అమెరికా పౌరురాలు మరణించింది. ఈ ఘటనపై అమెరికా స్పందించింది.
అమెరికన్ మహిళపై కాల్పులు
శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌లో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో 26 ఏళ్ల అమెరికా పౌరురాలు ఆషినో ఏజ్గి ఏగి మృతి చెందారు. ఆమెకు టర్కీ పౌరసత్వం కూడా ఉంది. నబలస్‌లో ఇజ్రాయెలీ సెటిల్‌మెంట్ విస్తరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపగా, ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నామని, వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నబలస్‌లోనే 13 ఏళ్ల పాలస్తీనా చిన్నారి కూడా ఇజ్రాయెల్ దళాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మొత్తం 36 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఒక్క జెనిన్ నగరంలోనే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హమాస్, ఇతర సంస్థల మిలిటెంట్లు కూడా ఉన్నారు.
ఇస్మాయెల్ హనియో అభియోగాలు వెనక్కు
మరోవైపు టెహ్రాన్‌లో హత్యకు గురైన హమాస్ నేత ఇస్మాయెల్ హనియెపై మోపిన అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC) ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణమంత్రి గలాంట్‌తో పాటు హనియెపై ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ యుద్ధ నేరాల అభియోగాలను మోపారు. అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హనియె జులై 31న హత్యకు గురయ్యారు.
ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలు
ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి అమెరికా ఇటీవలే ఆమోదం తెలిపింది. అందులో అనేక ఫైటర్ జెట్లు, 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్, అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, 120 ఎమ్ఎమ్ ట్యాంక్ మందుగుండు సామగ్రి, అధిక పేలుడు మోర్టార్లు ఉన్నాయి. అయితే ఈ ఆయుధాలన్నీ ఎప్పుడు ఇజ్రాయెల్‌కు చేరుకుంటాయనేది తెలియదు.